నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : today is telangana formation day

తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి 9 ఏళ్ళు నిండి 10 వ సంవత్సరంలోకి అడుగిడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతికి సంబంధించిన కొన్ని విషయాలను అవలోకనం చేసుకుందాం.

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : today is telangana formation day

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : today is telangana formation day 

తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి 9 ఏళ్ళు నిండి 10 వ సంవత్సరంలోకి అడుగిడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతికి సంబంధించిన కొన్ని విషయాలను అవలోకనం చేసుకుందాం. కరువుతో అల్లాడిన నేల... ఉన్న చోట పని లేక ఉపాధి కోసం వలస బాట పట్టిన నేల... సమయానికి నీళ్లు రాక... దక్కాల్సిన నిధులు దక్కక… ఉద్యోగ నియామకాల్లో అన్యాయానికి గురై... ఇలా అనేక నిరాశ నిస్పృహలతో ఉన్న తెలంగాణ ప్రజలు... తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఊరూ వాడా, గ్రామం పట్టణం అంతా ఏకమై పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేత కేసీఆర్... రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు ముగిసి 10 వ ఏట అడుగుపెడుతున్న శుభ సమయంలో దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన ప్రగతిని మరోసారి నలుదిశలా చాటేలా సంబరాలు జరుపుతోంది.

9 ఏళ్లలో ఐటీ రంగంలో 23 లక్షల ఉద్యోగాలు : 23 lakh jobs in IT sector in 9 years 

ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణాలో ఐటీ రంగం వేగంగా అభివృద్ది చెందింది. హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతూ అగ్రస్థానంలో నిలిచింది. రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించడమే కాకుండా... దాదాపు 23 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా... టైర్-2 పట్టణాలకు కూడా ఐటీని విస్తరించింది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్ధిపేట ప్రాంతాల్లో ఐటీ టవర్స్ నిర్మించింది. ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల తన యూకే, యూఎస్ఏ పర్యటనల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. కొన్ని సంస్థలు కరీంనగర్, నల్గొండలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. హార్డ్‌వేర్ రంగంలో ఫాక్స్‌కాన్ తమ యూనిట్‌ను కొంగరకలాన్‌లో నిర్మిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీ-హబ్ ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా రికార్డులకు ఎక్కింది. 

విద్యుత్ రంగంలో ముందడుగు : Advancement in power sector 

రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పడింది. అన్ని రంగాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వ్యవసాయానికి రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోంది. తెలంగాణ ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగా వాట్లు మాత్రమే ఉండేది. అనంతరం కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల నేడు రాష్ట్రంలో 17,305 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఈ తొమ్మిదేళ్లలో 2,012 యూనిట్లకు చేరుకుంది.

ఇంటింటికీ తాగు నీరు : Drinking water for every house 

ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతం తాగు నీటి కోసం అల్లాడిపోయింది. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పీడించింది. తెలంగాణ ఏర్పడిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం ప్రారంభమయ్యింది. 100 శాతం ఆవాసాలకు పైపుల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. నేషనల్ వాటర్ మిషన్ అవార్డుతో ప్రభుత్వాన్ని సత్కరించింది. ఇదే పథకాన్ని కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకొని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తోంది.

సాగు నీటితో సస్యశ్యామలం... కరెంటు లేక, బోర్లు వేసినా నీళ్లు రాక సాగు నీటి కోసం కష్టాలు పడిన రైతులు... ఇప్పుడు ఏడాదిలో రెండు, మూడు పంటలు వేస్తూ వ్యవసాయరంగ స్వరూపాన్నే మార్చివేశారు.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరంను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. గోదావరి నీటితో రాష్ట్రంలో రైతన్నలకు సాగు నీటి కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ చేశారు. దీంతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల వంటి చిన్న నీటి పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. ఇప్పుడు దాదాపు 90 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందుతోంది. పేదలకు సొంతిల్లు అందించే లక్ష్యంతో గృహలక్ష్మి పథకం అమలు చేస్తోంది. దేశంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు చేసింది. దీనికోసం రూ.19,126 కోట్ల కేటాయించింది. 

జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 60 ఏళ్ల కాలంలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే... తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లలోనే 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈ సంఖ్య చేరుకుంది. నేడు ప్రభుత్వ, ప్రైవేటులో మొత్తం 55 కళాశాలలున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు 2950 నుంచి 8340 సీట్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.33 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. రాబోయే రోజుల్లో మరో 80 వేల ఉద్యోగాల భర్తీ కానున్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా దాదాపు 2.21 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ కానున్నాయి. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. ఇక ప్రైవేటు రంగంలో 24 లక్షల మందికి ఉపాధి లభించింది. స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. అటెండర్‌ నుంచి, ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇవే కాకుండా అనేక సంక్షేమ పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కంటివెలుగు, తెలంగాణ ఆసరా పెన్షన్, గొర్రెల పంపిణీ పథకం, నేతన్న బీమా పథకం, ఆరోగ్య మహిళ వంటి పథకాలతో సంక్షేమంలో కూడా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది.

ప్రముఖుల శుభాకాంక్షలు : Greetings from celebrities 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ : Telangana CM KCR 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలు, ఆకాంక్షల సాధనకు కృషి చేస్తున్నాం. గ్రామస్థాయి నుంచి నగరం వరకు 21 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని, దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతి దశదిశలా చాటుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ బలీయ శక్తిగా తెలంగాణ ఎదిగిందని, తెలంగాణ దృక్పథంతో ప్రభుత్వం విధానాలను రూపొందించుకుందని తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము : President Draupadi Murmu 

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉన్న తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. అలాగే ఎందరో ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే పుట్టారు. తెలంగాణ అభివృద్ధి, అలాగే శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ : PM Narendra Modi 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ : Vice President Jagdeep Dhan Khad 

‘తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప వారసత్వం, సంస్కృతికి ఈ రాష్ట్రం ప్రతీక. అలాగే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు వివిధ రంగాల్లో రాణిస్తూ భారత్‌ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే అభివృద్ధి చెందుతూ, మరిన్ని అత్యుత్తమ శిఖరాలను అధిరోహించాలి’ అని ట్వీట్‌ చేశారు

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా : Lok Sabha Speaker Om Birla 

‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రజలు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.