విద్యాభివృద్ధికి 1800 ఎకరాలు దానం : Donation of 1800 acres for educational development
విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు.అయిన మూర్తిరాజు కొల్లేరు రాజుగా ప్రఖ్యాత గుర్తింపు పొందారు
విద్యాభివృద్ధికి 1800 ఎకరాలు దానం : Donation of 1800 acres for educational development
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు (murtiraju) ప్రముఖ గాంధేయవాది. స్వాతంత్య్ర సమరయోధులు.విద్యా వ్యాప్తికి తనకున్న 1800 ఎకరాలు దానం చేసిన దాత. సర్వోదయ ఉద్యమానికి చేయూతనిచ్చిన మహోన్నతుడు.ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అవడమే కాకుండా జిల్లాలో ఆక్వా పరిశ్రమకు ఆద్యుడుగా పేరొందిన వ్యక్తి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు.అయిన మూర్తిరాజు కొల్లేరు రాజుగా ప్రఖ్యాత గుర్తింపు పొందారు
తన 1800 ఎకరాల ఆస్తిని ధర్మసంస్థ ఏర్పాటుకు దానంగా ఇచ్చారు. 14 కళాశాలలు, 58 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి. స్త్రీ విద్యను ఎంతగానో ప్రోత్సహించారు . కొల్లేరు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ఆక్వా పరిశ్రమకు జిల్లాలో బీజం వేశారు. 1919 డిసెంబరు 16 న తణుకు సమీపంలోని సత్యవాడ లో జన్మించిన ఆయన జమిందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు, సూరాయమ్మలకు పుట్టిన ఏకైక సంతానం. ఆయనకు కలిగిన ఒక్కగానొక్క కుమారుడు చిన్నతనంలోనే కన్ను మూయగా భార్య సత్యవతీదేవి 2010లో పరమపదించారు. నారాయణపురంలో వీరి ఇంటికి సమీపంలో గోదావరి ఏలూరు కాలువ పక్కనే పాకలు వేయించి, వాటిలో వివేకానంద మాధ్యమిక పాఠశాలను బాపిరాజుగారు తమ స్వంత యాజమాన్యంలో నిర్వహించేవారు. మూర్తిరాజుగారు ఆ పాఠశాలలోనే మాధ్యమిక విద్య పూర్తిచేసారు. ఎనిమిదవ తరగతి వరకు అక్కడే చదివారు.
ప్రజాసేవకే అంకితం : Dedicated to public service
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మూర్తిరాజు తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారు. చిన్నతనంలోనే మహాత్మాగాంధీ ప్రభావం ఆయనపై పడింది. చివరి వరకు ఆయన నిజమైన గాంధేయవాదిగానే ఉన్నారు. మహాత్మాగాంధీ దేశ పర్యటనలో భాగంగా 1929లో జిల్లాకు వచ్చినప్పుడు చేబ్రోలు రైల్వేస్టేషనులో ఆయనను చూశారు. అప్పటి నుంచి గాంధీ మార్గంలోనే నడిచారు. గాంధేయవాదిగా ముద్ర వేసుకొని సత్యం, అహింస, స్వదేశీ విధానాలను తాను ఆచరించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాటికి విశేష ప్రచారం కల్పించారు. మాంసాహారానికి దూరంగా ఉన్నారు. చిన్నతనం నుంచే ఖద్దరు వస్త్రాలను ధరించడం మొదలు పెట్టారు. తన పక్క గ్రామమైన పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనం నిర్మించి ప్రజల స్మృతిపథం నుంచి మహాత్ముని రూపం చెరిగిపోకుండా చేశారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరులూదారు. అప్పటినుండి సర్వోదయ నాయకుడిగా ప్రఖ్యాతిని కూడా పొందారు.
1955లో వినోభాబావే భూదానోద్యమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు తనకున్న ఆస్తిలో 100 ఎకరాల భూమిని దానం చేశారు. 1961లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం నిర్వహంచారు. విద్యారంగంపై తిరుగులేని ముద్ర ఆయనకే సొంతం. విద్యారంగంలో మూర్తిరాజు తనదైన ముద్ర వేశారు. భీమవరం, ఏలూరు నగరాలకే పరిమితమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివినా చదువు విలువ గుర్తించి ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయాలనే తపన పడేవారు. బాపిరాజు ధర్మసంస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటికి దేశ నాయకుల పేర్లు పెట్టారు. కుటుంబంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా విద్యావంతులవుతారనేది ఆయన దృఢ విశ్వాసం. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. కళల్ని సాహిత్యాన్ని ప్రేమించే మూర్తిరాజు కళాకారులకు ఎందరికో ఉపాధి చూపించారు. భూరి విరాళాలిచ్చి అభినవ భోజుడిగా పేరుపొందారు.
విద్యావ్యాప్తికి నిరంతర కృషి
బాపిరాజుగారు 1929లో నారాయణపురంలో వివేకానంద మిడిల్ స్కూల్ నెలకొల్పారు. తొలుత పిల్లలు ఎవరూ చేరలేదు. ఊరూరా తిరిగి, అందరికీ ప్రచారం చేసి... మీ పిల్లలను చదివించండి, పుస్తకాలు ఇస్తాం, భోజనం పెడతాం... అని వాగ్ధానం చేసారు. పాఠశాలను నిలబెట్టడానికి బాపిరాజుగారు చాలా శ్రమించారు. ప్రభుత్వ అనుమతిని కూడా తెప్పించారు. అందుకోసం తమకున్న 40 ఎకరాల భూమిని హామీగా ప్రభుత్వానికి ఇవ్వవలసి వచ్చింది. ఇంత చేసినా చివరకు చదువుకునే పిల్లల సంఖ్య పెరగనే లేదు. ఆరు సంవత్సరాల పాటు స్కూలు నడిచింది. ఆ తరువాత పిల్లలు లేక నడవలేకుండా మూతపడింది. ఆ రోజుల్లో ఎవరికీ విద్య పట్ల ఆసక్తి అనేది ఉండేది కాదు. చదువుకున్నవారు ఏ పని చేయడానికి ఇష్టపడరని, సోమరిపోతులుగా తయారవుతారని రైతులు భావించేవారు.
6 సార్లు ఎమ్మెల్యేగా...
చిన్న వయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా (6 times MLA) ఎన్నికయ్యారు. 1952 నుంచి 1982 వరకు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, పెంటపాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెటింగు, గిడ్డంగులు, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రోటెం స్పీకరుగా కూడా పనిచేశారు. అత్యంత దుర్భర దారిద్య్రంతో బ్రతుకులీడుస్తున్న కొల్లేరు ప్రజల అభ్యున్నతికి విశేషమైన కృషి చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలను కలిపి కొల్లేరును జిల్లాగా చేయాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. ఈ విషయంపై అనేకమంది ముఖ్యమంత్రులతో ఆయన పోరాటాలు కూడా చేశారు. 1936లో లోకల్ బోర్డులు వచ్చాయి. అప్పుడు జటిస్ పార్టీకి బలం ఉండేది. సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు గవర్నరు అయ్యారు. బడేటి వెంకట్రామయ్య నాయుడు, పెన్మెత్స పెద్దిరాజు జిల్లాలోని పెద్ద నాయకులు, బాపిరాజు తాలూకా బోర్డు సభ్యులుగా ఉండేవారు. బోర్డు మీటింగ్ కోసం వచ్చిన సభ్యులకు ప్రయాణపు ఖర్చులు ఇచ్చే పద్ధతిని మానుకొందామని ఆయన సమావేశంలో తీర్మానం ప్రవేశపెడితే సభ్యులు అంగీకరించలేదు. ఆయన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.