ఆంధ్ర వైద్య కళాశాలకు నూరేళ్లు : 100 years of Andhra Medical College
ఆంధ్ర వైద్య కళాశాలకు నూరేళ్లు : 100 years of Andhra Medical College
ఆంధ్ర వైద్య కళాశాల (Andhra Medical College, AMC) ఈ ఏడాది జూలై 19 వ తేదీ నాటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. దేశంలోని పురాతన వైద్య కళాశాలల్లో ఒకటైన ఏఎంసీ (AMC) తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన కళాశాల. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే తెలుగు వారి కోసం ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో చదువుకున్న వారు ప్రపంచం నలుదిశలా తమ వైద్య సేవలను అందిస్తున్నారు.
ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర కలిసి ఉండేది. 1920 లో తెలుగు వారి కోసం వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు విజ్ఞప్తి చేశారు. దీంతో విశాఖపట్నంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమయింది. ఇది ఏర్పాటు చేయకముందు మద్రాస్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ అనుబంధంగా (Madras Stanley Medical College Affiliate) లైసెన్సీయేట్ మెడికల్ సర్టిఫికేట్ కోర్సులు ఉండేవి. విశాఖపట్నంలో అప్పటి మద్రాసు రాష్ట్ర స్థానిక సంస్థల మంత్రి పానుగంటి రామ అయ్యంగార్ 19 జూలై 1923 న 32 మంది విద్యార్థులతో ఒక ఆరోగ్య కేంద్ర భవనంలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఈ మెడికల్ కాలేజీకి తొలి ప్రిన్సిపాల్ గా కర్నల్ ఫెడ్రిక్ జాస్పర్ అండ్రూసన్ పని చేసినట్లు చరిత్రకారులు తెలిపారు. ఈ మెడికల్ కాలేజీకి తొలుత వైజాగపటం వైద్య కళాశాల అనే పేరు పెట్టారు. 1926 లో ప్రారంభమైన ఆంధ్ర యూనివర్సిటీకి ఈ కళాశాల అనుబంధ కళాశాలగా మారింది.
అప్పట్లో వైస్ ఛాన్సలర్ గా పని చేస్తున్న సీఆర్ రెడ్డి వైజాగపటం వైద్య కళాశాల పేరును 'ఆంధ్రా మెడికల్ కాలేజ్'గా మార్చాలని మద్రాస్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పేరు మారుస్తూ 1940 వ సంవత్సరంలో గెజిట్ కూడా విడుదల చేశారు. అప్పటి నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజ్ గా పేరు పొందింది. 32 సీట్లతో ప్రారంభమైన ఈ మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ప్రతి ఏడాది 250 మందికి ప్రవేశాలు కల్పిస్తోంది. అనాటమీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీతో పాటు మొత్తం 34 విభాగాల్లో వైద్య విద్యని ఏఎంసీ (AMC) అందిస్తోంది. ప్రారంభంలో ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ఆ తరువాత కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) గా మారింది. తొలి రోజుల్లో 132 పడకలతో ఏర్పాటు చేసిన కేజీహెచ్ (KGH) ప్రస్తుతం 1600 పడకలతో స్థాయికి పెరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాతో పాటుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ కి వైద్యం కోసం వస్తుంటారు.
ఆంధ్ర మెడికల్ కాలేజీ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుండడంతో ఇక్కడ చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థులందరూ కలిసి దాదాపు రూ.45 కోట్లను సేకరించి 1.2 ఎకరాల్లో ఒక భవనాన్ని నిర్మించి బహుమతిగా అందించనున్నారు. కళాశాల సమీపంలోనే నిర్మిస్తున్న ఈ భవనంలో లెక్చర్ హాల్, లెబ్రరీ, స్టూడెంట్ సెంటర్, రీడింగ్ రూం, రీక్రియేషన్ రూం, ఇండోర్ గేమ్స్ వంటి తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఈ భవనం నిర్మించిన తరువాత దీనికయ్యే మెయింటెనెన్స్ ఛార్జీలను సైతం పూర్వ విద్యార్థులే చెల్లించనున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ గొప్పదనాన్ని చాటిచెప్పేలా శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.