ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలు : AP YSRCP manifesto
ఈ నెల 13 వతేదీన జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్‌సీపీ తమ మేనిఫెస్టోను (YSRCP Manifesto) విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలు : AP YSRCP manifesto
ఈ నెల 13 వతేదీన జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్‌సీపీ తమ మేనిఫెస్టోను (YSRCP Manifesto) విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024, ఏప్రిల్ 27న ఈ మేనిఫెస్టోను విడుదల చేసారు. అధికార పార్టీ వైసీపీ కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు నిధుల పెంపుపైనే సీఎం జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. 9 ముఖ్యమైన హామీలతో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో 2024ను రూపొందించారు.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే...
- అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాలు కొనసాగింపు
- అమ్మ ఒడి పథకం కింద రూ.15వేల నుండి రూ.17వేలకు పెంపు.
- వైఎస్సార్ చేయూత పథకం క్రింద 8 విడతల్లో ఇచ్చే రూ.75 వేలను రూ. లక్షా 50 వేలకు పెంపు
- రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటన
- వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో ఇచ్చే రూ.60 వేలను రూ.లక్షా 20వేలకు పెంపు
- వైఎస్సార్ సున్నా వడ్డీ (Zero interest) కింద రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటన
- వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు
- కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగింపు
- హెల్త్, ఆరోగ్యశ్రీ విస్తరిస్తామని ప్రకటన
- రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులు రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు (కౌలు రైతులకు కూడా రైతు భరోసా కొనసాగింపు)
- అర్హులైన ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు... ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగింపు
- అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు
- ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీపై రాయితీ హామీ
- ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా (Accidental Insurance) అమలు
- లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు సైతం వాహన మిత్ర వర్తింపచేస్తామని హామీ
- వాహన మిత్రలో ఇచ్చే సాయం ఐదేళ్లలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు
- చేనేతలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేల సాయం
- నాడు-నేడు... పథకంలో ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలు
- ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ (Skill Hub) ... జిల్లాకో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ.. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
- స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా వర్తింపు
- ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సైతం విదేశాల్లో చదువుకునేందుకు రుణాలు
- ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్
రాజధానికి సంబంధించి సీఎం జగన్ హామీలు
- మళ్లీ అధికారంలోకి రాగానే రాజధానిగా విశాఖపట్నం
- రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖపట్నం
- శాసన రాజధానిగా అమరావతి
- న్యాయ రాజధానిగా కర్నూలు
ఇవి... వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు
2019 లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చినప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. తన పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఎన్నో కష్టాలు చూశానని, తమ పిల్లలను చదివించాలనే ఆసక్తి తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ, వారిని చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశానాని, అందుకే తాను చూసిన ఈ పరిస్థితుల పరిష్కారం కోసం తన 58 నెలల పాలనలో అమలు చేశానని, పేదలకు సంక్షేమ పథకాలు ఎన్నింటినో అందించామన్నారు. గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్లడం గతంలో ఎన్నడూ జరగలేదని మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు
మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామన్నారు జగన్. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని.. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందన్నారు. మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి పంపించామన్నారు. ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి తమ ప్రభుత్వం ఏమేం చేశామన్నది ప్రజలకు వివరించామన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని... చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు తాను చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనైనా నెరవేర్చారా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతుల్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో 32వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వ హయాంలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో పన్నుల భారం 6.57 శాతం అయితే తమ ప్రభుత్వ హయాంలో 6.35 శాతమని, అన్నింటికీ సరిపోల్చే లెక్కలు ఉన్నట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో అప్పులు 21.8 శాతం పెరిగాయని, కోవిడ్ పరిస్థితుల కారణంగా రెండేళ్లలో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు నిలిచిపోకుండా అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియింబర్స్‌మెంట్, గోరుముద్ద... ఇలాంటి పథకాలన్నింటినీ ఆపడం ఎవరి తరం కాదని.. తమ ప్రభుత్వం ఎంతో కష్టపడి చేపడుతుండడంతోనే ఈ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. వీటిని నిలిపి వేసేందుకు ప్రయత్నించడం, ఈ పథకాలను తొలగించడం ఎవరి వల్ల కాదన్నారు. చంద్రబాబు చెబుతున్న పథకాల అమలుకు రూ.లక్షా 21 వేల కోట్లు అవసరమని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి రూ.9,100 కోట్లు ఖర్చు చేయవలసి వస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ 10 హామీలకు మన సంక్షేమ పథకాలకు కలిపి అమలు చేయాలంటే కచ్చితంగా అక్షరాల లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది అమలు చేయడం ఎలా సాధ్యమని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.