గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ సమీక్ష : Gangs of Godavari Review

మాస్‌లో కొత్త లుక్‌తో విశ్వక్ సేన్ ఆకట్టుకునేందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ సమీక్ష : Gangs of Godavari Review

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ సమీక్ష :  Gangs of Godavari Review

విశ్వక్ సేన్ ముందు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా విభిన్న రీతిలో ఉండేలా అన్ని రకాల జానర్లను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవ్ స్టోరీ అయినా, మాస్ కారెక్టర్ అయినా, ప్రయోగాత్మక పాత్రలైనా కూడా విశ్వక్ సేన్ వాటి కోసం ముందుంటాడు. ఇక ఇప్పుడు మాస్‌లో కొత్త లుక్‌తో విశ్వక్ సేన్ ఆకట్టుకునేందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు కృష్ణ చైతన్య ఇది వరకు ప్రేమ కథా చిత్రాలను తీశాడు. ఇక అతను రూటు మార్చి రంగస్థలం, పుష్ప జానర్లోకి వచ్చాడు. కృష్ణ చైతన్య, విశ్వక్ చేసిన ఈ ప్రయత్నం మరి ఏ విధంగా ఉందన్నది ఓ సారి చూద్దాం.

కథ : Story 

కొవ్వూరు, గోదావరి మధ్యలోని లంకల ప్రాంతం చుట్టూ ఈసినిమా కథ జరుగుతుంది. అక్కడ ఓ ఆనవాయితీ ఉంటుంది. గంగమ్మ దగ్గర కత్తి కట్టడం అనే ఓ సంప్రదాయం ఈ లంక గ్రామాల్లో నడుస్తుంటుంది. ఎవరి పేరు అయినా రాసి కత్తి కడితే.. అతన్ని చంపే వరకు నిద్రపోరు. అలా రత్న అలియాస్ రత్నాకర్ (విశ్వక్ సేన్) పేరు మీద అతని నలుగురు స్నేహితులు కత్తి కడతారు. ఆ నలుగురు స్నేహితులు రత్నని ఎందుకు చంపాలనుకుంటారు? ఈ లంకల ప్రాంతంలోని రాజకీయాలు ఏంటి? నానాజి (నాజర్), ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ) మధ్య ఉన్న గొడవలు ఏంటి? ఏమీ లేని రత్న.. ఎమ్మెల్యేగా ఎలా ఎదుగుతాడు... ఆ తరువాత ఏం జరుగుతుంది... రత్న జీవితంలో రత్నమాల (అంజలి) పాత్ర ఏంటి? బుజ్జి (నేహా శెట్టి) వచ్చాక రత్న లైఫ్ ఎలా మారుతుంది? అన్నది ఈ సినిమాకి సంబంధించిన మూల కథ.

ఏ సినిమాలో అయినా కథా నాయకుడు జీరో నుంచి హీరో స్థాయికి ఎదగడం అన్నది ఎలాగైనా చూపించొచ్చు. రకరకాల దారుల్లో ఎదగడం ఎన్నో సార్లు మనం తెరపై చూశాం. ఈ చిత్రంలోనూ రత్న అలానే జీరో నుంచి మొదలుకొని ఎమ్మెల్యే వరకు ఎదుగుతాడు. అయితే ఆ ఎదిగే క్రమం కొత్తగా అనిపించదు. అలా అని ఆ ప్రయాణం బోరింగ్‌గా కూడా అనిపించదు. మొదటి పావుగంట ఏదో ఇంట్రెస్టింగ్‌గా కథ సాగుతుందే? అని అనేలా ఉంటుంది. కానీ ఆ తరువాత మళ్లీ ట్రాక్ తప్పినట్టుగా.. రొటీన్ కథను చూసినట్టు అనిపిస్తుంది. ఇక రంగస్థలం, పుష్ప ప్రభావం దర్శకుడి మీద బాగానే పడినట్టుగా అనిపిస్తుంది.

హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్‌గా, ఆకట్టుకునేలా ఉండదు. కానీ తెరపై సుట్టంలా సూసిపోకలా అనే పాట ఓ ట్రీట్‌లా అనిపిస్తుంది. అనవసరమైన పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటూ ఇలా ఏమీ పెట్టలేదు. కథలో భాగంగానే పాటలు అలా వచ్చి పోతుంటాయి. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్‌లో ఒకే ఒక్క పాట ఉంటుంది. అలా సో సోగా సాగుతూ పోతుండే కథ ఇంటర్వెల్‌కు ఆసక్తికరంగానే మారుతుంది. కానీ ఆ ట్విస్ట్‌ కూడా ముందుగానే తెలిసిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్ ఫైట్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. యువన్ సంగీతం ఎంతగానో అలరిస్తుంది.

మొదటి భాగం కాస్త హైలో సాగితే.. సెకండాఫ్ మాత్రం చాలా నీరసంగా, చప్పగా సాగుతుంది. రత్న ఎమోషన్స్, భార్యబిడ్డల కోసం పడే తాపత్రయం, ఆ సెంటిమెంట్‌ అంత ఎమోషనల్‌గా ప్రేక్షకులకి కనెక్ట్ కాదు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్‌లో విశ్వక్ మెచ్యూర్డ్ పర్ఫామెన్స్, ఎమోషనల్ టచ్ బాగుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఊపు.. సెకండాఫ్‌లో కనిపించదు. కానీ ఓవరాల్‌గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) అనేది విశ్వక్ సేన్‌కి ప్లస్ అవుతుంది. విశ్వక్ సేన్‌ లోని ఒక కొత్త యాంగిల్‌ను డైరెక్టర్ చూపించాడు. ఇలాంటి రగ్డ్, మాస్, యాక్షన్, విలేజ్ పొలిటికల్ డ్రామాను కూడా హ్యాండిల్ చేయగలను అని దర్శకుడు కృష్ణ చైతన్య (Director Krishna Chaitanya) నిరూపించుకున్నాడు.

 

సాంకేతికంగా ఈ చిత్రం బాగుంటుంది. యువన్ పాటలు, ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్. కెమెరా వర్క్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. మాటలు బాగుంటాయి. కానీ యాస మాత్రం కనిపించదు. ఒక పాట మాత్రం ఎప్పటికీ వినిపించేలా ఉంది. ఎడిటింగ్ చక్కగా కుదిరింది. మరీ లెంగ్తీగా కూడా అనిపించలేదు. సితార బ్యానర్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశ్వక్ సేన్ పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా నటించినా, యాక్షన్ సీక్వెన్స్‌తో స్క్రీన్ మీద ఊచకోత కోసినా కూడా విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు. విశ్వక్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించేశాడు. అంజలికి ఇంపార్టెంట్ రోల్ దక్కింది. నేహా శెట్టి నటన పరంగా ఓకే అనిపిస్తుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తుంది. విలన్‌గా కనిపించిన యాదు (గగన్ విహారి).. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ యాక్షన్ బాగుంది. హీరో ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రిగా గెద్ద రాజు (సాయి కుమార్) పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. నాజర్‌, గోపరాజు రమణ, చిన్న దొర పాత్రలు కూడా బాగుంటాయి.

నటులు : విశ్వక్ సేన్,అంజలి,నేహా శెట్టి,నాజర్,గోపరాజు రమణ

దర్శకుడు : కృష్ణ చైతన్య