ప్రమాదాల నుంచి కాపాడే తలుపులమ్మ లోవ తల్లి : Talupulamma thalli is the mother who protects from accidents

మీరు రవాణా వాహనాల వెనుక భాగంలో "తలుపులమ్మ తల్లి దీవెనలతో" లేదా "తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో" అనే రాతలను గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా చూసి ఉంటారు.

ప్రమాదాల నుంచి కాపాడే తలుపులమ్మ లోవ తల్లి : Talupulamma thalli is the mother who protects from accidents

మీరు రవాణా వాహనాల వెనుక భాగంలో "తలుపులమ్మ తల్లి దీవెనలతో" లేదా "తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో" అనే రాతలను గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా చూసి ఉంటారు. ఆ తలుపులమ్మ తల్లి అంటే ఈ జిల్లాల వారికి అంత్యంత ప్రీతి పాత్రమని చెప్పవచ్చు.

దట్టమైన అడవులతో నిండిన కొండల మధ్యలో లోవ తలుపులమ్మ తల్లి (Lova Talupulamma thalli) దేవాలయంలో అమ్మ కొలువై ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో సహజ సౌందర్యమైన అడవుల మధ్య అమ్మవారు భక్తులను అలరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాను 'దేవుని సొంత జిల్లా'గా పేర్కొంటారు. అన్నవరం పట్టణం తలుపులమ్మ తల్లి నివాసంగా ఉంది. ట్రక్కు, కార్లు, ఆటోల యజమానులు తలుపులమ్మ తల్లిని తమ వాహనాలను ప్రమాదాల నుంచి కాపాడే తల్లిగా కొలుస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలకు చెందిన వారు తలుపులమ్మ తల్లితో తమ బంధాన్ని ప్రత్యేకంగా ఉంచుతారు. ఎందుకంటే ప్రమాదాల నుండి కాపాడడంతో పాటుగా ఆదాయ పరంగా తమకు ఎన్నో లాభాలను పొందడానికి తల్లి తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వీరు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఇక్కడకి ఆయా ట్రక్కులు, మిగతా వాహనాలకు సంబంధించిన యజమానులు తల్లి కొలువై ఉన్న గుడి పాదాల వద్ద గుడారాలు వేసుకుని అమ్మవారికి జంతు బలి సమర్పిస్తారు. అంతే కాకుండా తమ వాహనాలకు సమ్బన్ధంచిన రిజిస్ట్రేషన్ నంబర్లను గుడి గోడలపై భక్తి శ్రద్ధలతో రాస్తుండడం ఇక్కడ కనిపిస్తుంది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసిన వారి తమ వాహనాలను ఇక్కడికి తొలుత తీసుకుని వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందేలా పూజలు నిర్వహిస్తారు. నిత్యం ఇక్కడ కొత్త వాహనాలకు పూజలు నిర్వహించడం కనిపిస్తుంటుంది. తలుపులమ్మ తల్లికి సంబంధించిన చరిత్రను 'మన న్యూస్' పాఠకులకు (Namatunews readers) ఈ వ్యాసం ద్వారా అందిస్తున్నాము.

 

తలుపులమ్మ తల్లి చరిత్ర : History of Talupulamma thalli

పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం, అగస్త్య మహర్షి (Maharshi Agastya) అమ్మవారు కొలువై ఉన్న ఈ ప్రదేశానికి సంబంధించిన సుందరమైన వైభవం, ప్రశాంతతను చూసి ఎంతగానో మంత్రముగ్ధుడయ్యాడు. దీంతో మహర్షి వారు ఇక్కడ స్థిరపడి ధ్యానం చేసాడు. ఆయన ఇక్కడి పర్వత సానువుల్లో తిరుగుతూ పండ్లు తిని, నీళ్లు త్రాగేవాడని భక్తులు నమ్ముతారు. ఆయన ఇక్కడి పర్వతాలకు 'దారకొండ (Daarakonda), తీగకొండ (Teegakonda)' అని పేరు పెట్టినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు కూడా 'దారకొండ' కొండ నుండి నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహాన్ని చూడవచ్చు.

 

తలుపులమ్మ తల్లి అమ్మవారు స్వయంభు (self-incarnate) అంటే స్వీయ అవతారం అని పురాణాల్లో చెప్పబడింది. ఆమె తలపు అంటే ఆలోచన కలిగిన తల్లిగా భక్తులకు వరాలు ఇచ్చే తల్లిగా నిలిచిపోయింది. అమ్మవారు చాలా దయగలిగిన తల్లి. ఆమె భక్తులు తన దగ్గరకు వచ్చే వరకు వేచి ఉండే తల్లి కాదని... ఒక్క ఆలోచన భక్తుల మదిలో మెదలగానే వెంటనే తనను స్మరించుకున్న భక్తుల వద్దకు పరిగెత్తుకుని వెళ్లే తల్లిగా ఆమె నిలిచింది. భక్తులు తనను ఏది కోరుకుంటే దానిని ప్రసాదించే తల్లిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. ఆలయాన్ని చేరుకోవాలంటే తలుపులమ్మ తల్లి గర్భగుడి వరకు వెళ్లే అలంకరించబడిన ప్రవేశ ద్వారం నుండి పొడవైన, నిటారుగా ఉండే మెట్ల మార్గాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. ఈ మార్గాన్ని అధిరోహించే భక్తులు దారిలో కొలువై ఉన్న విఘ్నేశ్వరుడు, ఇతర దేవతలను పూజించి ముందుకు కదులుతారు. భక్తులు తాము తయారు చేసి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి ప్రసాదించి అనంతరం దానిని స్వీకరించి తిరిగి బయలుదేరతారు. వాహన పూజ చేయించుకునే భక్తులు అమ్మవారికి జంతు బలి ఇచ్చిన తరువాత దానిని వండి అక్కడే ఆహారాన్ని భుజించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు మిగిలిన ఆహారాన్ని తమతో పాటు తీసుకెళ్లకుండా ఇక్కడ ఉన్న స్థానికులకు అందజేస్తారు.

 

ఇక్కడే వంట వండి దానిని భుజించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కోళ్లు, మేకలు సైతం ఇక్కడ ఉన్న దుకాణాల్లో విక్రయిస్తుంటారు. వంట పాత్రలు సైతం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో భక్తులు వంటకు కావాల్సిన సామాన్లను తమతో పాటుగా తీసుకుని వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ఆలయం రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. ఎందుకంటే ఇక్కడ వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. అంతే కాకుండా రాత్రి వేళ తలుపులమ్మ తల్లి ఈ ప్రాంతంలో సంచారం చేస్తుంటుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం, పండుగ దినాల్లో ఎక్కువ రద్దీగా ఉంటుంది. మిగతా రోజుల్లో మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రతి ఏడాది చైత్ర మాసమైన మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ, తదియ, బహుళ విధిలో 15 రోజుల పాటు, ఆషాఢ మాసమైన జూన్, జూలై నెలల్లో ముఖ్యమైన పండుగ జరుగుతుంది. ఈ సమయాల్లో వెలది మంది భక్తులు తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తారు. ఇందుకోసం ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లను చేస్తుంటుంది.

 

తలుపులమ్మ తల్లిని దర్శించుకోవడానికి అనేక మార్గాల ద్వారా చేరుకోవచ్చు. అమ్మవారి దేవస్థానం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుండి 70 కి.మీ, రాజమండ్రి నుండి 106 కి.మీ, అమలాపురం నుండి రాజమండ్రి మీదుగా 176 కి.మీ, తుని పట్టణం నుండి 8 కి.మీ దూరంలో ఉంది. NH-5 కి 6 కి.మీ, తుని రైల్వే స్టేషన్ నుండి 8 కి.మీ దూరంలో ఉంది. అయితే ఆలయం వద్దకు చేరుకోవాలంటే కేవలం బస్సు రవాణా మాత్రమే అందుబాటులో ఉంది. ఎవరైనా ఇక్కడకు చేరుకోవాలంటే మాత్రం సొంత వాహనాల్లోనో లేదా అద్దె వాహనాల్లోనో వెళ్లడం ఉత్తమం.