వినోదాత్మక చిత్రంగా 'సామజవరగమన' : 'Samajavaragamana' as an entertaining film
టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లలోనే తన విలక్షణమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు (Hero Srivishnu). అతను నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'.

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లలోనే తన విలక్షణమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు (Hero Srivishnu). అతను నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్, టీజర్ (trailer, teaser ) ఎంతగానో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. నేడు విడుదలైన ఈ సినిమా కథ గురించి తెలుసుకుందాం.
హీరో బాలు (శ్రీవిష్ణు)కి ప్రేమ అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా అమ్మాయి తనని ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే ఆ అమ్మాయితో రాఖీ కట్టించుకుంటుంటాడు. బాలు తండ్రి పాత్ర చేసిన సీనియర్ నరేష్ (Senior Naresh) గనుక డిగ్రీ పాస్ అయితే తనకి కోట్ల ఆస్తి దక్కేలా బాలు తాతయ్య వీలునామా రాసి చనిపోతాడు. అందుకోసం బాలు తన తండ్రిని డిగ్రీ పాస్ అయ్యేలా చేయించేందుకు నానా తిప్పలు పడుతుంటాడు. బాలు తండ్రేమో ముప్పై ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. బాలు తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉంటాడు. ఓసారి తండ్రిని పరీక్షా హాల్‌కు తీసుకెళ్లినప్పుడు అక్కడ డిగ్రీ పరీక్షలు రాయటానికి వచ్చిన హీరోయిన్ సరయు (రెబా మౌనికా జాన్, Heroine Reba Maunica John) పరిచయం అవుతుంది. సరయుకేమో హాస్టల్లో ఉండి చదువుకోవటం ఇష్టం ఉండదు. దాంతో సరయు బాలు ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వస్తుంది. కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకుంటున్న బాలు అంటే సరయు ఎంతాగానో ఇష్టపడుతుంది. బాలు కూడా తనతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి రాజమండ్రికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. సరయు కూడా రాజమండ్రికి చెందిన అమ్మాయే కావటంతో ఆమెకు సర్‌ప్రైజ్ ఇద్దామని బాలు సరయూకి చెప్పకుండా రాజమండ్రి వస్తాడు. బాలు బావ పెళ్లి చేసుకోబోయేది సరయు అక్కయ్యనే అనే నిజం బాలుకి తెలుస్తుంది. అక్కడే బాలుకి అసలు చిక్కు వచ్చి పడుతుంది.
కొన్ని సినిమా కథలు చాలా సింపుల్‌గా ఉంటాయి. అసలు సినిమాలో క్లైమాక్స్ ఏంటనే విషయాన్ని కూడా ప్రేక్షకుడు ముందుగానే ఊహించేస్తాడు. అయినా కూడా ఇటువంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. అందుకు అసలు కారణం. స్క్రీన్ ప్లే. రొటీన్ కథతోనే ఈసినిమా రూపొందినప్పటికీ చక్కటి వినోదాన్ని మిక్స్ చేసిన స్క్రీన్ ప్లేతో రూపొందిన సినిమాయే ఈ ‘సామజవరగమన’. ఇంతకు మునుపు అల్లూరి వంటి సీరియస్ సినిమా చేసిన శ్రీవిష్ణుకి ఆ సినిమా అంత పేరు తీసుకురాలేదు. కానీ నటనతో ఆకట్టుకున్నాడు. దీంతో తనకు అచ్చివచ్చిన కుటుంబ వినోదాత్మక కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని అద్భుత నటనను కనబరిచాడు.
సినిమాకు దర్శకత్వం వహించిన రామ్ అబ్బరాజు ‘సామజవరగమన’ సినిమాను ఉల్లాసకరమైన వినోద కోణంలో కథను చక్కగా రాసుకున్నాడు. సినిమాలో ప్రతీ పాత్రకు కామెడీ టచ్ ఉంటుంది. మొదటి హాఫ్ లో హీరో శ్రీవిష్ణు, అతని తండ్రిగా నటించిన సీనియర్ నరేష్ తమదైన నటనతో ప్రేక్షకులను కుర్చీల్లో నుంచి లేవనీయకుండా చేసారు. ప్రస్తుతం తండ్రి, మామయ్య వంటి పాత్రలు చేస్తున్న నరేష్‌కు చాలా రోజుల తర్వాత ‘సామజవరగమన’ చిత్రంలో హీరో తండ్రిగా నటనకు ఆస్కారమున్న చక్కటి పాత్ర వచ్చిందనే చెప్పాలి. నరేష్ సైతం తనదైన శైలి నటనతో చక్కగా ఆకట్టుకున్నాడు. ఆయా సీన్లలో తనదైన కామెడీ టైమింగ్, డైలాగులతో శ్రీవిష్ణు, నరేష్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇక సెకండాఫ్ అంతా కూడా హీరో శ్రీవిష్ణు తన ప్రేమను గెలిపించుకోవటం కోసం ఏయే ప్రయత్నాలు చేసాడనే యాంగిల్‌లో సినిమా ఉంటుంది. సినిమా క్లైమాక్స్‌లో ఒక అద్భుతమైన ఎమోషనల్ టచ్ ఇచ్చి సుఖాంతం చేశారు.
సెకండాఫ్ మొత్తం శ్రీవిష్ణు, సీనియర్ నరేష్ తో పాటుగా శ్రీకాంత్ అయ్యంగార్ ఇతరులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సినిమా చివరలో అసలు ఈ సినిమాను ఎలా ముగిస్తారా అని అనుకుంటున్న సమయంలో చక్కటి ట్విస్ట్‌తో శుభం కార్డ్ ఇచ్చేశారు. శ్రీవిష్ణు తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సీనియర్ నరేష్ తన అనుభవాన్ని ఉపయోగించి తన నటనను సిల్వర్ స్క్రీన్‌పై చక్కగా ప్రదర్శించాడు. హీరోయిన్ గా నటించిన రెబా మౌనికా జాన్ నటనతో ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గట్లుగా అందులో ఒదిగి పోయిందని చెప్పవచ్చు. ఇంకా మిగతా పాత్రల్లో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల మిగతా నటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేసారు.
దర్శకుడు రామ్ అబ్బరాజు సినిమా అంతా కూడా ప్రేక్షకులను నవ్వించేలా సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధంచేసుకున్నాడు. దానికి తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అలరించి నవ్విస్తాయి. గోపీసుందర్ రాసిన పాటలు, సినిమా నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంటాయి. రామ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. చివరిగా ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రంగా చెప్పవచ్చు. ఇందులో దర్శకుడు విజయవంతం అయ్యాడు.