జూలై 1 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర : Amarnath Yatra to start from July 1
హిమాలయ సానువుల్లో భక్తుల నోటా హరహర మహాదేవ్... అంటూ కొనసాగే అమర్‌నాథ్ యాత్ర వచ్చే నెల జూలై 1 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. పరమ శివుని భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా అమర్‌నాథ్
హిమాలయ సానువుల్లో భక్తుల నోటా హరహర మహాదేవ్... అంటూ కొనసాగే అమర్‌నాథ్ యాత్ర వచ్చే నెల జూలై 1 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. పరమ శివుని భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా అమర్‌నాథ్ గుహలో వెలిసి మంచు శివలింగాన్ని దర్శించాలని కోరుకుంటారు. అమర్‌నాథ్ హిందువుల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ మందిరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత సానువుల మధ్య కొలువై ఉంది. ఈ మందిరం హిమాలయాల్లో దక్షిణ కాశ్మీర్ పర్వత శ్రేణుల్లో 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. జమ్మూ కాశ్మీర్ నుండి 141 కిలో మీటర్ల దూరంలో ఈ మందిరం ఉంది. అమర్‌నాథ్ ఆలయానికి పహల్ గాం అనే గ్రామం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అమర్‌నాథ్ గుహ చుట్టూ ఎత్తైన మంచు కొండలు ఉంటాయి. ఒక్క వేసవి కాలంలో తప్ప మిగతా సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సమయంలోనే లక్షలాది మంది భక్తులు మంచు కొండల్ని దాటుకుంటూ అమర్‌నాథ్ గుహకు చేరుకొని మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. గుహలో పరమ శివుడు మంచు శివలింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఎన్నో కఠిన సవాళ్ళను ఎదుర్కొంటూ భక్తులు శివలింగాన్ని దర్శించుకునేందుకు చేరుకుంటారు. ఆ పరమశివుడే తమను నడిపించి దర్శన భాగ్యం కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
హిందులకు పరమ శివుడు అంటే ఎంతో ప్రీతి. ఆయన్ని కొలవని హిందువే ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ పరమ శివుడ్ని దర్శించి తరించాలని భక్తులు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి మరీ అమర్‌నాథ్ యాత్రకు వెళతారు. అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాది ఏప్రిల్ 17 వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయింది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు అమర్‌నాథ్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర కోసం ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా దేశంలోని పలు బ్యాంకుల్లో తగిన రుసుము చెల్లించి కూడా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. జూలై 1 నుండి మొదలయ్యే ఈ యాత్ర ఆగస్టు 31 వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం 62 రోజులు అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది. చాలామందికి ఇప్పటికీ అమర్‌నాథ్ యాత్ర గురించి చాలా మందికి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో మిగిలిపోయాయి. ఆధునిక టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ ఈ రహస్యాలను తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధ్యపడలేదు. అదే ఆ భోళాశంకరుని మహత్యం. ఒకప్పుడు 2 వేళా నుంచి 3 వేళా మంది వరకూ అమర్‌నాథ్ దర్శనానికి వచ్చేవాళ్ళు. అయితే అది నేడు లక్షల్లోకి చేరుకుంది. 2011 వ సంవత్సరంలో రికార్డు స్థాయిలో అయితే 6 లక్షల 34 వేల మంది భటులు దర్శించుకున్నారు.
హిందూ పురాణాల్లో వివరించిన ప్రకారం... పరమశివుడు అమర్‌నాథ్ గుహలోనే జగన్మాత పార్వతీ దేవికి అమరత్వం మంత్రాన్ని వివరించినట్లు లిఖించబడింది. మంత్రాన్ని ఉపదేశిస్తున్న సమయంలో ఆ గుహలోనే ఉన్న రెండు పావురాలు ఆ మంత్రాన్ని వున్నాయి. అప్పటి అమరత్వ మంత్రాన్ని విన్న ఆ రెండు పావురాల జంట ఇప్పటికీ అమర్‌నాథ్ గుహలోనే ఉన్నాయి. ఇది నిజంగా ఆ పరమ శివుడు ఉపదేశించిన అమరత్వం మంత్రం మహిమేనని భక్తులు విశ్వసిస్తారు. శంకరుడు ఉపదేశించే అమరత్వం మంత్రం విన్నవారికి మరణం ఎప్పటికీ సంభవించదు.
పరమ శివుడు తన మూడో నేత్రం తెరవడంతో ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని పురాణాల్లో లిఖించబడింది. అమర్‌నాథ్ గుహలో ఉండే శివలింగం సహజసిద్ధంగానే పెరుగుతుంది. అందుకే ఇక్కడి శివలింగాన్ని 'స్వయంభూ లింగం' అంటారు. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను పరమశివుడు ఇక్కడే వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని 'పంచతరణి' అని కూడా అంటరాని పురాణాల్లో రాయబడింది. ఈ గుహలో పరమశివుడు జలరూపంలో దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. 'స్వయంభూ లింగాన్ని' దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఐదు ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్‌నాథ్ గుహ లోపల ఉన్న శివలింగం దగ్గర నుంచి నీరు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఈ నీరు ఎక్కడ నుంచి ప్రారంభం అవుతుందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది.
అమర్‌నాథ్ కు ఎలా చేరుకోవాలి? : How to reach Amarnath?
అమర్‌నాథ్ క్షేత్రం సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది జమ్మూ సిటీ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, రైళ్ల ద్వారా జమ్మూ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా పహల్గామ్ లేదా బల్తాల్ చేరుకోవాలి. జమ్మూ నుంచి బల్తాల్ 373 కిలోమీటర్ల దూరంలోనూ, పహల్గామ్ 260 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి. ఈ రెండు ప్రణతాల నుంచే అమర్‌నాథ్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి బల్తాల్ నుంచి రెండు రోజులు పడుతుంది. పహల్గామ్ నుంచి సుమారు 48 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి దాదాపు 5 రోజుల సమయం పడుతుంది. ఇక్కడికి చేరుకోవాలనుంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది.