నేడు శ్రీరామనవమి : Today Sriram Navami
త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యా పుత్రుడై భువిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటుంటాం
నేడుశ్రీరామనవమి : Today Sriram Navami
శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యా పుత్రుడై భువిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటుంటాం. ఈ ఏడాది 30-03-2023 చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమిగా హిందూ భక్తులు జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని కీర్తిస్తూ భక్తులు పండుగ జరుపుకుంటారు.
14 సంవత్సరాల పాటు అరణ్య వాసం, రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేక కార్యక్రమం కూడా చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందనేది భక్తుల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. సీతారాముల కల్యాణాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లోనూ జరుపుతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. యావత్ భారతావని శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
పురాణ గ్రంథాల ప్రకారం రామాయణంలో అయోధ్య నగరానికి రాజుగా ఉన్న దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజ్యానికి వారసులే ఉండరనేది ఎప్పుడూ పీడిస్తూ ఉండేది. ఆ సమయంలో వశిష్ట మహాముని దశరథుడితో పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దీంతో దశరథుడు రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించేందుకు ఆయన ఆశ్రమానికి వెళ్లి తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడుకి అందజేసి తన భార్యలకు ఇవ్వమన్నాడు. ఇందులో సగం పెద్ద భార్యకు, మరో సగం చిన్న భార్యకూ ఇచ్చాడు. దీంతో వీరిద్దరూ వారి భాగాల్లోంచి సాగ భాగం తీసి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొంతకాలానికి వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదో రోజున కౌసల్య రామునికి జన్మనిచ్చింది. కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారు.
శ్రీ రామనామ ప్రాశస్త్యం
ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల విశ్వాసం.
శ్రీరామనవమి రోజున ఊరూరా, వీధుల్లో పెద్ద పెద్ద చలువ పందిళ్ళు వేస్తారు. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా పండుగ నిర్వహిస్తారు. నేటి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా ఆ శ్రీరాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యంగా చేసి అందరకీ పంచుతారు.
శ్రీరామ ప్రవర :
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర :
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతుఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…