పాపుల రక్షణకై క్రీస్తు జన్మించెను : Christ was Born to Save Sinners
పాపులను రక్షించడానికి దేవుడైన యెహోవా తన కుమారుడిని భూమి పైకి పంపించెను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ లోని లేఖనములు చెబుతున్నాయి. క్రీస్తు అనగా రక్షకుడు. మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం.
పాపుల రక్షణకై క్రీస్తు జన్మించెను : Christ was Born to Save Sinners
పాపులను రక్షించడానికి దేవుడైన యెహోవా తన కుమారుడిని భూమి పైకి పంపించెను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ లోని లేఖనములు చెబుతున్నాయి. క్రీస్తు అనగా రక్షకుడు. మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం.
బైబిల్ గ్రంథంలోని లూకా సువార్తలో ఈ విధంగా వ్రాయబడింది.. అయితే ఆ దూత భయపడకుడి; “ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11
సుమారు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల సమూహము తమ గళములతో ప్రకటించిన సువార్తమానమును యావత్ ప్రపంచమంతా నేటికీ కులమతాలకు అతీతంగా జరుపుకుంటున్నారు. క్రీస్తు పుట్టుక విశేషాలను ఆయన సేవకులు విశ్వమంతా చాటుతున్నారు.
దేవదూతలు ప్రకటించిన ఆ సువార్తమానం ఏమిటి? యెహోవా దేవుని కుమారుడు పరలోకాన్ని విడిచి భూలోకంలో మానవునిగా అవతరించి, తనను తాను తగ్గించుకుని పాపములో పడి జీవించుచున్న ప్రతి మానవుడిని పాపముల నుంచి రక్షించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వస్తున్నాడని చెప్పిందే దేవదూతల సువార్తమానం,
కన్య మరియ గర్భాన మానవునిగా జన్మించిన క్రీస్తు..
మనుష్య రూపంలో పుట్టేందుకు దేవుడు కన్య అయిన మరియను ఎన్నుకున్నాడు. ఆమె గర్భమందు యేసు జన్మించిన తీరు అయన యొక్క గొప్ప ప్రణాళిక. నెలలు నిండిన మరియను యేసేపు అన్ని గృహాలకు తీసుకెళ్లి సాయం అర్ధించాడు. ఎవ్వరూ కూడా ఇంటి లోపలి ప్రవేశం ఇవ్వకపోవడంతో పశువుల శాలలో మరియను తీసుకు వెళతాడు. అక్కడ మరియ యేసుకు జన్మనిస్తుంది.
ఆయన జన్మ సమయంలో ఆకాశంలో ఒక తార వెలుస్తుంది. ఒక ప్రాంతంలో గొర్రెలు కాసుకునే వారు చలి మంట కాగుతుండగా ఆకాశంలో ఒక గొప్ప వెలుగు వచ్చింది. దీంతో కాపరులు భయపడుతుండగా... ఆకాశంలో నుంచి దేవదూతలు ఇదిగో మీకొరకు రక్షకుడు ఉదయించినాడని ప్రకటించారు. వారిని ఆ నక్షత్రం వెంబడి వెళ్ళమని చెప్పగా వారు వెళ్లి క్రీస్తుని దర్శించి కానుకలు సమర్పించారు.
ఎంత సౌభాగ్యము... ఆయన జన్మ ఎంత దయనీయము. మానవునిగా పుట్టడానికి దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. మానవునిగా జీవించాలని క్రీస్తు తనను తాను తగ్గించుకుని పశువుల పాకలో జన్మించాడు. పాపులమైన మనకోసం ఆయన ఎందుకు అలా జన్మించాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను పాపినే. అయితే నాకు రక్షణ ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ రక్షణ నాకు ఎలా లభిస్తుంది? అసలు నాకోసం ఆయన ఎందుకు భూలోకానికి వస్తున్నాడని మానవుని ఆలోచన.
దేవుని ఆజ్ఞను మీరిన ఆదాము హవ్వ
పాత నిబంధన గ్రంథంలోని మొదటి పుస్తకం ఆదికాండంలో పేర్కొన్నట్లుగా... దేవుని చేత సృష్టించబడిన ఆదాము, హవ్వ దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపము చేశారు. దీంతో అప్పటి నుంచి వారి సంతానం మొత్తం పాపములో పడి జీవిస్తున్నారు. అయన ఆజ్ఞను మీరడంతో అప్పటివరకు సుఖసంతోషాలతో జీవించిన ఆదాము హవ్వ నరకప్రాయాన్ని అనుభవించారు. దేవుని ఉగ్రతకు గురియై దేవుని సన్నిధిని, అయన పవిత్రతను పోగొట్టుకున్నారు. వారి ద్వారానే ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది. నూతన నిబంధనలో రోమా పత్రిక 5:12 లో అనగా “ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము అందరికి సంప్రాప్తమాయెను” అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బయలు పరుస్తూ వుంది.
అనగా దేవుడు పుట్టించిన మనుష్యులు పాపంలో పడి జీవిస్తుండటంతో వారిని రక్షించేందుకు దేవుడైన యెహోవా తన కుమారుడిని మనుష్య రూపంలో ఈ భూమి మీదకి పంపించారు. పాపులను రక్షించుటకు జన్మించిన “రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” అని లూకా 2:11 లో వ్రాయబడిన ఈ సువార్తమానము సిలువలో కార్యరూపము దాల్చింది”.
అంటే పాపంలో పడి జీవిస్తున్న మానవుల కోసం ఆయన కుమారుడు సిలువపై మరణించాడు. మనందరి అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి కొరడా దెబ్బలు తిని మన కోసం మరణించాడు. ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషములను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మీద మోపెను అని యెషయా 53:5,6 లో వ్రాయబడి ఉంది.
పాపుల కొరకై సిలువలో రక్తం చిందించిన యేసు
మనందరి పాపముల కోసం ఆయన సిలువను మోశారు.. కొరడా దెబ్బలు తిన్నారు.. సైనికులు ఆయన మొహంపై ఉమ్మి వేశారు. రాళ్లతో కొట్టబడ్డారు. రక్తాన్ని చిందించారు. తలపై ముళ్ల కిరీటం పెట్టబడింది. కాళ్ళు, చేతుల్లో మేకులు దిగబడ్డాయి. ఆఖరికి సిలువ వేయబడ్డారు. సమాధి చేయబడ్డాడు. మూడవ రోజున సమాధి నుంచి మృత్యుంజయుడై లేచి మనకు రక్షణను ఇచ్చాడు. మనందరి కోసం ఆయన తండ్రి అయిన యెహోవా దేవునితో నిరంతరం మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఇలాంటి గొప్ప రక్షకుడు జన్మించిన రోజునే క్రిస్మస్ గా అందరూ జరుపుకుంటున్నారు.
ఇంత గొప్ప త్యాగం చేసిన ఆయన కోసం మనం ఏమి చేస్తే నిజమైన క్రిస్మస్ ఆనందం లభిస్తుంది? నూతన నిబంధన గ్రంథంలో 1యోహాను 1:9 లో “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల అయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక అయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రలనుగా చేయును “ అని వ్రాయబడింది. “ప్రభువైన యేసునందు విస్వసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది.
ఈ క్రిస్మస్ పర్వదినం మీ జీవితంలో నిజమైన రక్షణ దినం కావాలని శాంతి సమాధానములను, ఆశీర్వాదములను మిక్కిలిగా క్రీస్తు యేసు ద్వారా మీరు పొందాలని కోరుకుంటున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక!!