స్టీవెన్ స్మిత్ కెరీర్ : Steve smith career

పడి లేచిన కెరటం... ఉప్పొంగిన గోదారిలా ఎగసి... సునామీని తలపించే విధ్వంసం... సుడిగుండంలోని అగాధం లాంటి జీవితం నుంచి తనను తాను అద్భుతంగా మలచుకున్న తీరు... ఇది స్టీవ్ స్మిత్ కెరీర్...

స్టీవెన్ స్మిత్ కెరీర్ : Steve smith career

 

స్టీవెన్ స్మిత్ కెరీర్

పడి లేచిన కెరటం... ఉప్పొంగిన గోదారిలా ఎగసి... సునామీని తలపించే విధ్వంసం... సుడిగుండంలోని అగాధం లాంటి జీవితం నుంచి తనను తాను అద్భుతంగా మలచుకున్న తీరు... ఇది స్టీవ్ స్మిత్ కెరీర్... 

కన్నీళ్లను దిగమింగి... పడి లేచిన కెరటం...

కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు... అని కవి చెప్పినట్లుగా స్టీవ్ స్మిత్ తన కెరీర్ ను మలచుకుని ప్రపంచ అగ్ర శ్రేణి బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. లెగ్ స్పిన్నర్ గా కెరీర్ ప్రారంభించి అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా ఎదిగిన వారు ఎంతో అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో స్టీవ్ స్మిత్ ఒకరు. ఆస్ట్రేలియాకు చెందిన స్మిత్ తన జట్టులో ప్రధాన బ్యాట్స్మెన్ గా ఎదిగి జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. 2018 లో బాల్ టాంపరింగ్ వివాదంలో కెప్టెన్సీని పోగొట్టుకోవడమే కాకుండా ఏకంగా సంవత్సరంపాటు నిషేధానికి గురైనప్పటికీ బాధను దిగమింగి తిరిగి జట్టులోకి వచ్చి తాను ఎంత విలువైన ఆటగాడినో అని నిరూపించిన బ్యాట్స్మెన్. అందుకే మంచి ఆల్ రౌండర్ గా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

స్మిత్ జూన్ 02, 1989 సిడ్నీలో జన్మించాడు. పూర్తి పేరు స్టీవెన్ స్మిత్ అయినప్పటికీ స్టీవ్ స్మిత్ గా అందరికి చిరపరిచితుడు. కుడి చేతి బ్యాటింగ్, లెగ్ స్పిన్ బౌలర్, మిడిలార్డర్ బ్యాట్స్మన్. దిగ్గజ బ్యాట్స్మన్ సర్ డోనాల్డ్ బ్రాడ్మాన్ సాధించిన 29 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. దిగ్గజాల సరసన నిలిచాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు.

2018 లో ఎదురైన బాల్ టాంపరింగ్ వివాద నిషేధం ముగిసిన తరువాత 2019 లో యాషెస్ సిరీస్ లో పునరాగమనం చేసి 774 పరుగులతో నిలిచాడు. అప్పట్లో విమానాశ్రయంలో స్మిత్ కన్నీళ్లతో కనిపించిన ఫోటోలు ఎందరి చేతో కన్నీళ్లు పెట్టించాయి. కెప్టెన్సీ పోయినా అధైర్యపడక మొక్కవోని దీక్షతో జట్టుతో చేరి తన విలువేమిటో, తానేమిటో తన బ్యాటింగ్ తో ప్రపంచానికి చాటి చెబుతున్నాడు.

టెస్టుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ యావరేజ్ (60.89) కలిగిన ఉత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడిగా ఉన్నాడు. వన్డేలు, టీ20 లు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఇలా ఫార్మాట్ అయినా పరుగుల వరద పారించేవాడు. టెస్టు బ్యాట్స్మెన్ ముద్ర నుంచి బయటపడి వన్డేల్లో 45 కి పైగా యావరేజ్ సాధించాడు. 2015 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ సర్ డోనాల్డ్ బ్రాడ్మాన్ సాధించిన రికార్డును కూడా స్మిత్ అధిగమించాడు.

ప్రపంచ రికార్డుల ఛేదనలో స్మిత్

సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో ప్రపంచ రికార్డు కూడా స్మిత్ తన పేరున లిఖించుకున్నాడు. 151 టెస్ట్ ఇన్నింగ్స్ లో 8000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అగ్ర స్థానంలో నిలిచాడు. గతంలో రికార్డు శ్రీలంక బ్యాట్స్మెన్ కుమార సంగక్కర పేరున ఉండేది. స్మిత్ 60 సగటుతో రికార్డును సాధించాడు. భారత బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ 150 మొదటి ఇన్నింగ్స్ లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచ రికార్డును కూడా స్మిత్ బద్దలు కొట్టాడు.

ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో రికీ పాంటింగ్ 41 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో 32 సెంచరీలతో స్టీవ్ వా, 30 శతకాలతో స్టీవ్ స్మిత్, మాథ్యూ హేడెన్ లు మూడో స్థానంలో ఉన్నారు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా 73 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ తో 2019 నవంబర్ 30 జరిగిన టెస్టులో ఫీట్ సాధించాడు. 126 టెస్టు ఇన్నింగ్స్ లో రికార్డును అధిగమించాడు. 57 టెస్టుల్లో 26 సెంచరీలు చేసిన ఘనత కూడా స్మిత్ కే దక్కింది.

స్మిత్ అధిగమంచిన రికార్డును గతంలో సాధించిన వారిలో...

  • వేలీ హమ్మండ్ (ఇంగ్లాండ్) 131 ఇన్నింగ్స్
  • వీరేందర్ సెహ్వాగ్ (భారత్) 134 ఇన్నింగ్స్
  • సచిన్ టెండూల్కర్ (భారత్) 136 ఇన్నింగ్స్
  • సర్ గారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్), కుమార సంగక్కర (శ్రీలంక) విరాట్ కోహ్లీ (భారత్) 138 ఇన్నింగ్స్
  • సునీల్ గవాస్కర్ (భారత్), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) 140 ఇన్నింగ్స్

ఏడాది అధిక టోర్నమెంట్లు జరగనుండడంతో మరో రికార్డును అధిగమించే అవకాశం స్మిత్ ముంగిట ఉంది. టెస్టుల్లో 172 ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసి రికార్డు సృష్టించిన శ్రీలంక బ్యాట్స్మెన్ కుమార సంగక్కర రికార్డును అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 162 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 8647 పరుగులు చేసాడు. మరో 353 పరుగులను ఇంకో 10 ఇన్నింగ్స్ లో చేస్తే రికార్డును అధిగమిస్తాడు. భారత్, ఇంగ్లాండ్ లతో టెస్టు సిరీస్ లు ఉండడంతో స్మిత్ కి ఇది అసాధ్యం కాదనే చెప్పవచ్చు.

ఐపీఎల్ లో స్మిత్

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ లో కూడా స్మిత్ ఎంట్రీ ఇచ్చాడు. 2012 లో స్మిత్ ఐపీఎల్ లో ఆరంగ్రేటం చేసాడు. 2018-2020 మధ్యకాలానికి సంవత్సరానికి రూ.12.50 కోట్ల చొప్పున రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. మొత్తం 10 సీజన్లలో 103 మ్యాచ్ లు ఆడాడు.

 

స్మిత్ కెరీర్ బ్యాటింగ్, బౌలింగ్ గణాంకాలు

స్మిత్ తన కెరీర్లో దాదాపు అన్ని ఫార్మాట్లలోనూ ఆడాడు. టెస్టులు, వన్డేలు, టీ20 లు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీలు సాధిస్తూ పలు రికార్డులు కొల్లగొట్టాడు. అటు బ్యాట్, ఇటు బంతితో రాణించాడు. స్మిత్ సాధించిన పరుగులు, వికెట్లను ఒకసారి పరిశీలిద్దాం.

బ్యాటింగ్

టెస్టులు... 92 టెస్టుల్లో 162 ఇన్నింగ్స్ ఆడి 20 సార్లు నాటౌట్ గా నిలిచాడు. 8647 పరుగులను సాధించాడు. అత్యధిక స్కోరు 239 పరుగులు. బ్యాటింగ్ సగటు 60.89 గా ఉంది. పరుగుల్లో 30 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 942 ఫోర్లు, 49 సిక్సర్లు బాదాడు. మంచి ఫీల్డర్ కూడా అయిన స్మిత్ 151 క్యాచ్ లు పట్టాడు.

వన్డేలు... 139 వన్డేల్లో 124 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 15 సార్లు నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4917 పరుగులు చేయగా, 164 పరుగులు అత్యధిక స్కోరు. బ్యాటింగ్ సగటు 45.11 గా ఉంది. 12 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు చేసాడు. 431 ఫోర్లు, 47 సిక్సులు బాదాడు. 78 క్యాచ్ లు కూడా పట్టాడు.

అంతర్జాతీయ టీ20 లు... 63 అంతర్జాతీయ టీ20 ల్లో 51 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 11 సార్లు నాటౌట్ గా నిలిచాడు. 90 పరుగులు స్మిత్ అత్యధిక స్కోర్. బ్యాటింగ్ సగటు 25.20 గా ఉంది. మ్యాచ్ ల్లో నాలుగు సార్లు అర్ధ సెంచరీలు చేసాడు. 85 ఫోర్లు, 24 సిక్సర్లు బాదడమే కాకుండా 39 క్యాచ్ లు పట్టాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్... స్మిత్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో సాధించిన ఘనతను ఎంత చెప్పుకున్నా తక్కువే. 151 మ్యాచ్ ల్లో 261 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 30 సార్లు నాటౌట్ గా నిలిచాడు. 13147 పరుగులను 56.91 సగటుతో సాధించాడు. 239 పరుగులు అత్యధిక స్కోర్. ఇందులో మొత్తం 46 సెంచరీలు, 57 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1500 బౌండరీలు, 96 సిక్సర్లు బాదాడు. మొత్తం 237 క్యాచ్ లు అందుకున్నాడు.

లిస్ట్ A క్రికెట్... మొత్తం 188 లిస్ట్ A క్రికెట్ మ్యాచ్ ల్లో 171 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 27 సార్లు నాటౌట్ గా నిలిచి 6934 పరుగులు చేసాడు. ఇందులో 164 అత్యధిక వ్యక్తిగత స్కోరు. పరుగులో 15 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 586 ఫోర్లు, 96 సిక్సులు కొట్టిన స్మిత్ 107 క్యాచ్ లు కూడా పట్టాడు.

టీ20 లు... 235 టీ20 లు ఆడిన స్మిత్ 206 ఇన్నింగ్స్ లో 44 సార్లు నాటౌట్ గా ఉండి 4804 పరుగులు చేసాడు. 101 అత్యధిక స్కోరు. ఒక సెంచరీతో పాటు, 21 అర్ధ సెంచరీలు ఇందులో ఉన్నాయి. 425 ఫోర్లు, 108 సిక్సర్లు బాదిన స్మిత్ 130 క్యాచ్ లు పట్టాడు.

బౌలింగ్

బ్యాటర్ గా మంచి ఫామ్ లో ఉన్న స్మిత్ తొలుత లెగ్ స్పిన్నర్ గా క్రికెట్లోకి అడుగుపెట్టాడు.  స్మిత్ పలు వికెట్లను కూడా తీసాడు. 61 టెస్టు ఇన్నింగ్స్ లో 19 వికెట్లు తీసాడు. వన్డేల్లో 40 ఇన్నింగ్స్ లో 28 వికెట్లు, 17 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్ లో 17 వికెట్లు, 52 టీ20 ఇన్నింగ్స్ లో 54 వికెట్లు, 128 ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇన్నింగ్స్ లో 70 వికెట్లు, 69 లిస్ట్ A ఇన్నింగ్స్ లో 47 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

స్మిత్ సాధించిన ప్రపంచ రికార్డులు

అతి తక్కువ (126) టెస్టు ఇన్నింగ్స్ లో 7000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్

అతి తక్కువ (151) టెస్టు ఇన్నింగ్స్ లో 8000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్

ఒక టెస్టు ఇన్నింగ్స్ లో 5 క్యాచ్ లు పట్టిన మొదటి క్రికెటర్

స్మిత్ జీవితంలో ఉద్విగ్న క్షణాలు

ఐపీఎల్ 2017 లో జరిగిన ఫైనల్ ఓవర్ ఉత్కంఠ రేపింది. పుణె సూపర్ జెయింట్ సారధిగా ఉన్న స్మిత్ సేన ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్లో తన జట్టు ఓటమిని చూస్తూ విషాదంలో కూరుకుపోయాడు. ఆఖర్లో 51 పరుగులతో ఉన్న స్మిత్ జట్టును విజయతీరాలకు చేర్చే క్రమంలో ఔటవ్వడంతో మిగతా వికెట్లను కోల్పోయి ఓటమి చెందింది.

అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశం

  • 2010 జులై 13 పాకిస్తాన్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ తో టెస్టులో ప్రవేశం
  • 2010 ఫిబ్రవరి 19 వెస్టిండీస్ తో మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో ప్రవేశం
  • 2010 ఫిబ్రవరి 5 పాకిస్తాన్ తో మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ తో టీ20 ల్లో ప్రవేశం

చివరిగా కొన్ని విషయాలు 

ఇంగ్లాండ్ తో 2017-18లో జరిగిన టెస్టులో స్మిత్ పరుగుల సగటు 63.75. క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్ తర్వాత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతటి సగటు ఉన్న క్రికెటర్ స్మిత్ ఒక్కడే. అయితే 2018 లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో స్మిత్ బాల్ ట్యాపరింగ్ చేసినట్లు నిర్దారణ కావడంతో స్మిత్ నిషేధానికి గురయ్యాడు. దీని కారణంగా స్మిత్ బ్యాటింగ్ సగటు 61.37 గానే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పరిగణనలోకి తీసుకుంటోంది.