'2018' మూవీ రివ్యూ : '2018' movie review
పేరొందిన ఒక్క నటుడు గానీ, నటి గానీ లేరు. అయినా 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది '2018' మూవీ. అందరూ హీరోలే అనే ట్యాగ్ తో కేరళ రాష్ట్రంలో 2018లో సంభవించిన వరదలను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ సినిమా
'2018' మూవీ రివ్యూ : '2018' movie review
పేరొందిన ఒక్క నటుడు గానీ, నటి గానీ లేరు. అయినా 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది '2018' మూవీ. అందరూ హీరోలే అనే ట్యాగ్ తో కేరళ రాష్ట్రంలో 2018లో సంభవించిన వరదలను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ సినిమా. వాస్తవికతకు దగ్గరగా సినిమా చూస్తున్నంతసేపు కుర్చీ నుంచి లేచి చప్పట్లు కొట్టని ప్రేక్షకుడు ఉండడు... కన్నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరు. మలయాళ భాషలో సినిమా నిర్మించినా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.
ఎక్కడో ఇండోనేసియాలో సునామీ వచ్చింది, జపాన్‌లో భూకంపం, చైనాలో వరదలు సంభవించాయని టీవీల్లో చెబితే చూసి... కొద్దిసేపటికి దాని గురించి మర్చిపోతాం. కానీ అవే ప్రకృతి విపత్తులు మనం ఉన్న చోట జరిగితే ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెడతాం. కేరళ రాష్ట్రంలో 2018 లో అటువంటి ఓ ప్రకృతి విపత్తు సంభవిచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎన్నడూ చూడని వరదలు ముంచెత్తితే దానికి ఎదురొడ్డి తమను తామే కాపాడుకున్నారు. దీనినే కళ్ళకు కట్టినట్లు చూపించింది '2018' చిత్ర బృందం. కొన్ని పాత్రలను ఎంచుకుని దానిని తెరపై చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒకసారి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
రివ్యూ : Review
కేరళలోని అరువిక్కుళం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. సహజంగా మనిషికి మనిషికి మధ్య ఉండే భేదాభిప్రాయాలు, వారి మధ్య ఉండే వైరుధ్యాలే ఇక్కడున్న వారిలో కూడా కనిపిస్తాయి. గ్రామిని చెందిన అనూప్ (టొవినో థామస్) దేశ సేవ చేద్దామని ఆర్మీలో చేరతాడు. అయితే అక్కడి పరిస్థితులకు భయపడి నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. అందరూ కూడా అనూప్ ను వెటకారం చేస్తుంటారు. గ్రామంలో ఉన్నవారిలో ఒక్కొక్కరిది ఒక్కో జీవితం. అయితే సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలను అనుకోకుండా ముంచెత్తిన వరదలు అతలాకుతలం చేస్తాయి. వరద నీరు ఇంటి పైకప్పు వరకూ చేరినప్పుడు వారి నిస్సహాయత, వేలాది మంది ఎదుర్కొన్న బాధ, ఆ బాధను దిగమ్రింగి వాళ్ళు దానిని ఎదిరించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రోజుల తరబడి వర్షం పడుతూనే ఉండటం... చూస్తుండగానే క్షణాల్లో ఇళ్లు నీట మునిగిపోవడం.. కళ్ల ముందే తమ వాళ్లు కొట్టుకుపోవడం చూసి ఏమీ చేయలేక జనాల దయనీయ స్థితి, ఇంటి పైకప్పు వరకు వరద నీరు చేరడం, కొండచరియలు విరిగి పడడం, కరెంటు లేకపోవడంతో అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలియక జనాలు అల్లాడిపోతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయం కోసం ఎదురుచూస్తే తెల్లవారేసరికి వేలాది మంది ప్రాణాలు వరదలతో పాటు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది.
ప్రథమార్ధం అంతా సినిమా సాఫీగా సాగిపోతుంది. అంతా నార్మల్ గానే ఉంది కదా మేము చూడని వర్షాలా అని జనాలు అనుకునే లోపు... కేరళలోని మత్స్యకారులు సాయానికి మేమున్నామంటూ ముందుకొస్తారు. సముద్రంలో సుడిగుండాలను సైతం ఓడించి ఒడ్డుకు చేరుకునే మత్స్యకారులు వారి బోట్లను తీసుకుని వరదలకు ఎదురొడ్డి రెస్య్కూ ఆపరేషన్ చేస్తారు. వారు అందులో ప్రాణాలకు తెగించి వారు పడిన శ్రమ ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. వీరితో పాటుగా లోకల్స్ చేసిన సాయం, ఓ గర్భిణిని హెలికాప్టర్‌లో ఎయిర్ లిఫ్ట్ చేసిన సీన్, కొండచరియలు విరిగిపడి శిథిలమైన ఓ ఇంట్లో నుంచి జనాలను కాపాడిన విధానం.. ఇలా ప్రతి సీన్ చప్పట్లు కొట్టేలా చేస్తుంది.
ఇందులో నటించిన అనేకంటే పాత్రల్లో జీవించిన టోవినో థామస్, ఆసిఫ్ అలీ, లాల్, ఇంద్రన్స్, సుధీష్, నరేన్, కుంచాకో బోబన్, కలైయరసన్, గౌతమి, తన్వీ రామ్, అపర్ణ బాలమురళీ, అజూ వర్గీస్ ఇలా ప్రతి ఒక్కరూ తమ అద్భుతమైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్ లో టొవినో థామస్ నటన చూస్తే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. ఇక పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు కరెక్ట్‌గా సరిపోయాయి. సినిమాటోగ్రఫీ, చమన్ చాకో ఎడిటింగ్, క్వాలిటీ VFX అద్భుతంగా ఉన్నాయి.
నటులు (Actors) : టొవినో థామస్, ఆసిఫ్ అలీ, లాల్, ఇంద్రన్స్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాల మురళి
దర్శకుడు (Director) : జూడ్ ఆంటొని జోసెఫ్
ఎడిటింగ్ (Editing) : చమన్ చాకో
సినిమాటోగ్రఫీ (Cinematography) : అఖిల్ జార్జ్
నిర్మాతలు (Producers) : వేణు కున్నప్పిల్లి, ఆంటో జోసెఫ్, C. K. పద్మ కుమార్
విడుదల తేదీ (releasing date) : మే 26