కొల్లేరులో విదేశీ పక్షులు : Migratory birds in Kolleru
పక్షుల కిలకిలారావాలు... నీటిలోకి తొంగి చూస్తే కనిపించే రకరకాల చేపలు... స్వచ్ఛమైన నీరు... విదేశీ పక్షులు... వెరసి కొల్లేరు (Kolleru lake) అతిథి పక్షులతో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఆసియా (Asia) ఖండంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచింది కొల్లేరు.
కొల్లేరులో విదేశీ పక్షులు : Migratory birds in Kolleru
పక్షుల కిలకిలారావాలు... నీటిలోకి తొంగి చూస్తే కనిపించే రకరకాల చేపలు... స్వచ్ఛమైన నీరు... విదేశీ పక్షులు... వెరసి కొల్లేరు (Kolleru lake) అతిథి పక్షులతో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఆసియా (Asia) ఖండంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచింది కొల్లేరు.
విదేశీ వలస పక్షులకు (birds) విడిదిగా ఉన్న కొల్లేరు సరస్సు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. లక్షకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు (nature) పెట్టింది పేరుగా నిలిచింది. అరుదైన పక్షులకు ఆలవాలంగా నిలిచింది. ఈ సరస్సుకు విదేశీ పక్షులు (Migratory birds) వలస వచ్చి ఇక్కడ విడిది చేస్తుంటాయి. వీటితో పాటు స్వదేశీ పక్షులు సైతం సరస్సులో సందడి చేస్తుంటాయి. దీంతో ఇక్కడ పక్షుల సంరక్షణా కేంద్రాన్ని (Bird sanctuary) కూడా ఏర్పాటు చేసారు. సరస్సుకి మధ్యలో ఎన్నో లంక గ్రామాలున్నాయి. వందల రకాల జాతుల చేపలు కొల్లేరులో లభిస్తాయి. లక్షలాది మందికి ఉపాధిని కూడా అందిస్తోంది కొల్లేరు. ఒక్కసారి ఈ కొల్లేరుకి సంబంధించిన విషయాలను పరిశీలిద్దాం.
సహజ సిద్దమైన మంచి నీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల మధ్య 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీని సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్లు. కొల్లేటికి రకరకాల పక్షులు వలస వస్తుంటాయి. ఇక్కడకు వలస వచ్చే పక్షులలో పెయింటెడ్ కొంగలు (Painted storks), ఆసియా ఓపెన్ బిల్డ్ కొంగలు (Asian open-billed storks), గ్రే హెరాన్లు (Gray herons), ఐబిసెస్ (ibises), టీల్స్ (teals), స్పాట్-బిల్డ్ పెలికాన్లు (spot-billed pelicans), పరజ, పురాజము, నులుగు పిట్ట ముఖ్యమైనవి.
ఇవేకాకుండా కాలానుగుణంగా ఆస్ట్రేలియా, నైజీరియా, ఫిలిఫ్ఫీన్స్, ఈజిప్ట్, సైబీరియా… లాంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చే వలస పక్షులు పర్యాటకులను (Tourists) విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. గోదావరి, కృష్ణా (KG Basin) నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సులోకి (lake) బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు, లోయేరు నుంచే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని కొల్లేరులోకి చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు 62 కిలోమీటర్ల పొడవున్న ఉప్పుటేరు అనే ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతంలోకి (Bay of Bengal) చేరుతుంది.
కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని చిత్తడి నేలల్లో (Wetlands) కొల్లేరు సుమారు 1.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొల్లేరు పరిధిలో 122 లంక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారుగా మూడు లక్షల మంది నివాసం ఉంటున్నారు. వీరికి కొల్లేరులో చేపల వేట (fishing), చెరువుల్లో చేపల (fish ponds) పెంపకం జీవనాధారంగా ఉంది. కొల్లేరులో అరుదైన పక్షి జాతులు, వందల రకాల చేపలకు ప్రసిద్ధి గాంచింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు,పెదపాడు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాల పరిధిలో సరస్సు లోపల 20 బెడ్ గ్రామాలు (bed villages), సరస్సును ఆనుకుని 63 బెల్ట్ గ్రామాలున్నాయి. కృష్ణా జిల్లా పరిధిలో మండవల్లి, కైకలూరు మండలాల పరిధిలో సరస్సు లోపల 26 బెడ్ గ్రామాలు, సరస్సును ఆనుకుని 13 బెల్ట్ గ్రామాలు ఉన్నాయి.
పెరిగిన 'ఆక్వా' కల్చర్ : Aqua culture improved in Kolleru
వ్యవసాయం ఆధారంగా జీవించిన కొల్లేరు ప్రజలు ప్రతి ఏడాది అధిక వర్షాలకు (heavy rains) కొల్లేరులోకి అతిగా వచ్చి చేరే నీటి ముంపుతో ఎంతో నష్టపోయేవారు. దీంతో కొన్ని వందల కుటుంబాలు కొల్లేరును విడిచి వలసలు వెళ్ళిపోయేవి. 1969 లో వచ్చిన తీవ్ర తుఫానుతో (cyclone) ఇక్కడ వ్యవసాయం చిన్నాభిన్నమైంది. దీనిని గుర్తించి కొల్లేరు నివాసులకు జీవనోపాధిని కలుగజేయాలన్న ఆలోచనతో 1976లో జలగం వెంకట్రావు ప్రభుత్వం జీవో నెం.118 ద్వారా చేపల చెరువుల తవ్వకాలకు దిగింది. రెండు జిల్లాల్లో కలిపి 136 సొసైటీలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా చేపల చెరువుల తవ్వకాలను మొదలు పెట్టింది. జిరాయితీ, డీఫారం (D Form) భూముల్లో కూడా చెరువుల తవ్వకాలకు శ్రీకారం చుట్టింది.
దీంతో కొల్లేరువాసుల జీవనోపాధికి పరిష్కారం లభించినట్లయింది. 1990 తరువాత ఈ ప్రాంతాల్లో రొయ్యలు (Aqua culture), చేపల సాగు ఊపందుకుంది. పెద్ద ఎత్తున ఆక్వా సాగు మొదలవడం, లాభాలు కనబడడంతో అన్ సర్వే భూముల్లో కూడా చేపల చెరువుల తవ్వకాలు మొదలు పెట్టారు. దీంతో పాటు నెమ్మదిగా కొల్లేరును కూడా ఆక్రమించడం మొదలుపెట్టారు. క్రమంగా ఇక్కడ వ్యవసాయం (Agriculture) నుంచి ఆక్వా రంగానికి మళ్లడంతో కొల్లేరువాసుల జీవనశైలిలో మార్పు వచ్చింది. సొసైటీలు లాభాల బాట పట్టాయి. చేపల చెరువులు లాభదాయకంగా ఉండడంతో వెలుపలి వ్యక్తులు ఇక్కడికి వచ్చి చెరువుల్ని లీజుకి (lease) తీసుకుని ఆక్వా సాగును మరింత విస్తారం చేసారు. ఒకప్పుడు ఎకరానికి రూ.50 వేలు ఉండే లీజు ఇప్పుడు రూ.లక్షన్నరకి చేరుకుందంటే చేపల సాగులో ఎంత లాభం వస్తుందో ఊహించవచ్చు.
వ్యర్ధాలతో అనర్ధం : Unworthy with wastage
ఒకప్పుడు స్వచ్ఛమైన కొల్లేటిలోని నీరు (pure water) త్రాగే ఇక్కడి ప్రజలు నేడు గుక్కెడు మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం పెరిగిన ఆక్వా సాగు (Aqua culture). ఈ చెరువుల నుంచి వచ్చే కలుషిత జలాలు కొల్లేటిలోకి వచ్చి చేరుతుండడంతో నీరు కలుషితమవుతోంది. పెద్ద ఏర్లుతో సహా వివిధ కాలువల ద్వారా పారిశ్రామిక వ్యర్థాలు (Industrial wastes), రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల (plastic wastes) చేరికతో నీరు కలుషితంతో పాటుగా కొల్లేరు పూడుకుపోతోంది. దీనికి తోడు గుర్రపు డెక్క. ఇది కొల్లేటి నుండి నీరు బంగాళాఖాతంలోకి వెళ్లనీయకుండా అడ్డుగా ఉంటోంది. దీనికారణంగా కొల్లేరు ఎగపోటు వచ్చి చెరువులను నిండా ముంచేస్తోంది. 1900 సంవత్సరం నాటికి సముద్ర (Sea) మట్టానికి దిగువున ఉన్న కొల్లేరు ఇప్పుడు ఎగువకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం కొల్లేరును ఆక్రమించి చెరువులను తవ్వడమే కారణమని పర్యావరణ ప్రేమికులు (Environment lovers), స్థానికులు అంటున్నారు. ఆదాయం లభిస్తూ జీవనం వృద్ధి చెందినప్పటికీ అప్పడుడప్పుడు మా కొంప కొల్లేరు అవుతోందని లంకవాసులు వాపోతుంటారు.
కాంటూరు అంటే...: What is Contour?
కాంటూరుని సముద్ర మట్టానికి ఎగువ, దిగువన ఎంతమేర ఉంది అని లెక్కగట్టి నిర్ణయిస్తారు. ప్రస్తుతం కాంటూరు-5 గా ఉన్న కొల్లేరు పరిధిని (KOlleru boundaries) కాంటూరు-3 కి కుదిస్తే 40 వేల ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తుంది. దీనివల్ల వేలాది మందికి ఎంతో ఉపాధి కలుగుతుంది. కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి కుదించాలని స్థానికులు చాలా సంవత్సరాలుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం కేంద్రం చేతుల్లోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
వలస పక్షుల సందడి ఏది? Where is the migratory birds buzz?
కొల్లేరులో కాలుష్యం పెరిగిపోతుండడంతో విదేశీ పక్షుల రాక తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2009వ సంవత్సరంలో చిత్తడి నేలల పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొల్లేరును 2012లో ఎకో సెన్సిటివ్ జోన్గా (Eco sensitive zone) ప్రకటించింది. అయినప్పటికీ కొల్లేరులో పర్యావరణ పరిరక్షణలో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొంది. గతంలో అరుదైన జాతి పక్షులు (Rare species of birds) ఇక్కడికి వలస వచ్చేవి. అటువంటి పక్షులు నేడు కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో అరుదైన సీగల్ (బ్రౌన్ హెడ్), ఎల్లో లాఫింగ్ (తీతు పిట్ట జాతి), స్నైఫ్ (మగ ఉల్లంగి పిట్ట), స్పాటెడ్ రెడ్ షాంక్ (ఉల్లంగి పిట్ట జాతి) పక్షులు కూడా కొల్లేటికి వస్తున్నాయి.
కొల్లేరులో కొన్ని సంవత్సరాల క్రితం నీటి కొరత (Water scarcity) రావడంతో నీటి లభ్యత లేక విదేశీ పక్షులు రాకపోవడానికి ఒక కారణంగా నిలిచింది. గత రెండేళ్లుగా కురుస్తున్న విస్తార వర్షాలతో కొల్లేరు నిండు కుండలా మారింది. దీంతో రానున్న వేసవి కాలంలో విదేశీ అతిథి పక్షులు రావొచ్చని పక్షుల ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన పక్షుల (Rare birds) రాక కారణంగా పర్యాటకుల (Tourists) సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ళ క్రితం వరకు ఇక్కడ కొల్లేటిపై ఆధారపడి 2 కోట్ల పక్షులు మనుగడ సాగించేవి. అయితే నానాటికీ వీటి సంఖ్య తగ్గిపోతోంది. విదేశీ పక్షులు తూర్పు ఐరోపా, ఉత్తర ఆసియా ప్రాంతాల నుంచి సంతానోత్పత్తి కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తుంటాయి.
పక్షుల సంరక్షణ కేంద్రాలు : Bird Sanctuary
ఆటపాక, మాధవాపురం (ఏలూరుకి 10 కిలోమీటర్లు) గ్రామాల్లో పక్షుల కోసం పక్షుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఇక్కడ పక్షులు విడిది చేసుకునేలా చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. వేటగాళ్ల (hunters) నుంచి పక్షులను రక్షించేందుకు ఇక్కడ గార్డులను (guards) సైతం ఏర్పాటు చేసారు. ఇక్కడ పక్షులను వీక్షించేందుకు సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు.
సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉండడం వల్ల పక్షుల సంచారం తక్కువగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా శీతాకాలంలోనూ (winter season) వీటి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే అంశమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కొల్లేరు ఆక్రమణలు, నీటి కాలుష్యమేనని (water pollution) వివరిస్తున్నారు. గతంలో వలస పక్షులు 4 నెలలు నుంచి నాలుగున్నర నెలలు ఇక్కడ విడిది చేసేవి. అయితే ప్రస్తుతం ఇది సగానికి పడిపోయింది. కిక్కిస పొదలను ఇష్టానుసారంగా నరికివేస్తుండడంతో పక్షులకు గుడ్లు పొదిగే (Eggs hatch) అవకాశమే ఉండడం లేదు.
సహజ సిద్ధమైన, ప్రకృతి (nature) ప్రసాదించిన పంచభూతాలు భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. వీటిని నాశనం చేయడంలో మానవుడు ముందంజలో ఉంటున్నాడు. నీరు మనిషకి జీవనాధారం. ఏ జీవి అయినా నీరు (water) లేనిదే మనుగడ సాగించలేవు. అటువంటి నీటి కాలుష్యం కారణంగా కొల్లేరులో ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. కొల్లేరులో గుర్రపు డెక్కను తొలగిస్తే పక్షులకు మేత (feed) దొరుకుతుంది. ఆక్రమణలు తొలగిస్తే తిరిగి కొల్లేటి పూర్వ వైభవం తిరిగి వస్తుందని పర్యావరణ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
2018లో పెలికాన్ ఫెస్టివల్ (Pelican festival) ను రూ.కోటి ఖర్చుతో ఈ ప్రాంతంలో చేశారు. అయితే దేశ, విదేశీ పక్షుల కనీస సదుపాయాలకు ఖర్చు చేసినట్లయితే బాగుండేదని స్థానికులు అంటున్నారు. ప్రకృతినే కాకుండా, పక్షి జాతులను కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
కొల్లేటి విస్తీర్ణం : 250 నుంచి 340 చదరపు కిలోమీటర్లు
కొల్లేరు సరాసరి లోతు : 0.5 నుంచి 2 మీటర్లు
చేపల చెరువులు : 2,22,600 ఎకరాలు
అభయారణ్యం : 1,66,000 ఎకరాలు (వైల్డ్ లైఫ్ శాంక్చురి) పరిధిలో ఉంది
నీటిని తెచ్చే పెద్ద ఏర్లు : బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు
మేజర్, మైనర్ కాలువలు : 67
ఉప్పుటేరు పొడవు : 62 కిలోమీటర్లు
పక్షి జాతులు : 189 రకాలు