ఐపీఎల్ లో ఎప్పటికీ పదిలంగా ఉండే 7 రికార్డులు : 7 unbeatable IPL records
ప్రపంచంలోని ఆయా దేశవాళీ టోర్నమెంట్లు ప్రసిద్ధి చెందినప్పటికీ, భారత్ లో బీసీసీఐ ద్వారా ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో ఖ్యాతి సంపాదించుకుంది.
ఐపీఎల్ లో ఎప్పటికీ పదిలంగా ఉండే 7 రికార్డులు : 7 unbeatable IPL records
ప్రపంచంలోని ఆయా దేశవాళీ టోర్నమెంట్లు ప్రసిద్ధి చెందినప్పటికీ, భారత్ లో బీసీసీఐ ద్వారా ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో ఖ్యాతి సంపాదించుకుంది. ధనాధన్ క్రికెట్ గా ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. లీగ్ కు మొట్టమొదట టాటా కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరించింది. మొత్తం 10 టీమ్ లతో ఈ లీగ్ ని నిర్వహించారు. పొట్టి క్రికెట్ గా 20 ఓవర్ల పాటు నిర్వహించే ఈ క్రికెట్ లో ఎందరో బ్యాట్స్ మెన్స్, బౌలర్లు తమ ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఫీల్డింగ్ విన్యాసాలు అయితే చెప్పనవసరమే లేదు. కళ్ళు చెదిరే క్యాచులతో తమ ప్రతిభను చాటారు.
ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ ఐపీఎల్ నుంచి ఎందరో వర్ధమాన క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయ జట్టులోకి కూడా ఎంపిక అవుతున్నారు. వీరిలో యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, కులదీప్ యాదవ్ వంటి వారు ఉన్నారు. ఐపీఎల్ లో రికార్డులతో పాటు చాలామంది ఆటగాళ్లకు లక్షల నుంచి కోట్లాది రూపాయల వరకు వేలంలో చెల్లించి ఆయా జట్లు తీసుకుంటాయి.
కోట్ల రూపాయల బ్రాండ్ విలువలో ఐపీఎల్ జట్లు
మొత్తం 10 జట్లు ఈ ఐపీఎల్ లో ఆడుతున్నాయి. ఒక్కో జట్టు యొక్క బ్రాండ్ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఐపీఎల్ లో దేశీయ క్రీడాకారులతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా పాల్గొంటారు. ఎంతో చక్కటి సుహృద్భావ వాతావరణంలో ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతున్న ఐపీఎల్ జట్ల బ్రాండ్ వేల్యూని తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్ అందరికంటే ఎక్కువగా రూ.9,962 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.8,811 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ రూ.8,428 కోట్లతో మూడో స్థానంలోనూ, లక్నో సూపర్ జెయింట్స్ రూ.8,236 కోట్ల విలువ విలువను కలిగి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7,930 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రూ.7,853 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.7,662 కోట్లు, సన్ రైజ్ హైదరాబాద్ రూ.7,432 కోట్లు, పంజాబ్ కింగ్స్ రూ.7,087 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.6,512 కోట్ల బ్రాండ్ విలువ కలిగి ఉన్నాయి. ప్రతి ఏడాది ఐపీఎల్ కు ఆదరణ పెరుగుతోంది గానీ తరగడం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లో ఎప్పటికీ బద్దలు కాని అసాధ్యమైన రికార్డులను పరిశీలిద్దాం.
1. 20 ఓవర్లకు 263/5 పరుగులు చేసిన ఆర్సీబీ (RCB)
ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచుల్లో అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అత్యధిక స్కోర్ ను సాధించింది. పూణే వారియర్స్ తో 2013 ఏప్రిల్ 23 న జరిగిన మ్యాచులో ఇది సాధ్యమయింది. జట్టు 263/5 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 175 అత్యధిక పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. మిస్టర్ 360 గా పిలవబడే ఏబీ డివిలియర్స్ కేవలం 8 బంతుల్లో 31 పరుగులు చేసాడు. జవాబుగా పూణే జట్టు 20 వర్ల పాటు ఆడి 133/9 దగ్గరే ఆగి ఓటమి పాలయింది.
2. కేవలం 66 బంతుల్లో 175 పరుగులు
పూణే జట్టు నుంచి ఆర్సీబీ (RCB) జట్టుకు మారిన క్రిస్ గేల్ అదే జట్టుపై కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ లో 13 ఫోర్లు, 17 సుదూర సిక్సర్లు ఉన్నాయి. గేల్ యొక్క స్ట్రయిక్ రేట్ 265.15 ఐపీఎల్ లో అప్పట్లో ఇదే అత్యంత వేగవంతమైన శతకంగా చాలా సంవత్సరాల పాటు నిలిచింది. బ్యాటుతోనే కాకుండా బాల్ తో కూడా మ్యాజిక్ చేసి కేవలం ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
3. కేవలం 49 కే ఆల్ అవుట్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టు అత్యంత అల్ప స్కోర్ కే ఆల్ అవుట్ అవుతుందని ఊహించగలమా? పూణే వారియర్స్ పై 263/5 పరుగులు చేసిన ఆర్సీబీ జట్టు 2017 ఏప్రిల్ 23 న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచులో కేవలం 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కేకేఆర్ నిర్ధేశించిన 132 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో క్రమంగా వికెట్లను కోల్పోయి సగం ఓవర్లు కూడా ఆడలేక చతికిలబడింది. ఏ ఒక్క బ్యాట్స్ మన్ కూడా రెండంకెల స్కోర్ చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్.
4. ఒక సీజన్లో 4 శతకాలతో అత్యధిక పరుగులు
ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రన్ మెషిన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ సాధించాడు. ఈ పరుగులను నాలుగు సెంచరీలతో సహా సాధించడం విశేషం. ఈ ఘనతను కోహ్లీయే 2016 ఐపీఎల్ లో సాధించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 4 సెంచురీలు, 7 అర్ధ సెంచురీలతో 973 పరుగులను 81.08 సగటుతో సాధించాడు. 16 మ్యాచుల్లో 83 ఫోరులు, 38 సిక్సులు బాదాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు అలానే పదిలంగా ఉంది.
5. మూడుసార్లు హ్యాట్రిక్స్ నమోదు చేసిన అమిత్ మిశ్రా
ఐపీఎల్ లో మొట్టమొదటి హ్యాట్రిక్ చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన లక్ష్మీపతి బాలాజీ మొట్టమొదటి హ్యాట్రిక్ వికెట్లను పంజాబ్ కింగ్స్ పై సాధించాడు. ఐపీఎల్ 15 సీజన్లలో బౌలర్లు ఇప్పటివరకు 21 హ్యాట్రిక్లు సాధించారు. యువరాజ్ రెండుసార్లు హ్యాట్రిక్అ నమోదు చేసాడు. త్యధిక సార్లు హ్యాట్రిక్ సాధించిన రికార్డు మాత్రం భారత దిగ్గజ స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా పేరిట నమోదైంది. అమిత్ శర్మ ఐపీఎల్ లో మూడుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసాడు. అమిత్ 2008, 2011 మరియు 2013లో ఈ హ్యాట్రిక్లు సాధించాడు. 15 సీజన్ల ఐపీఎల్ లో ఇలా మూడు హ్యాట్రిక్ లు నమోదు చేసిన బౌలర్ ఎవ్వరూ లేరు. మిశ్ర ఇప్పటికే క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఏ బౌలరూ బ్రేక్ చేయలేదు.
6. ఐపీఎల్ లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జోసెఫ్ 6/12
ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యుతమ బౌలింగ్ గణాంకాలు ఐదు సార్లు నమోదు అయ్యాయి. 2008 లో సోహైల్ తన్వీర్ పేరిట తొలుత ఉత్తమ గుణకాలు నమోదు చేసాడు. తన్వీర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు (4/6) తీసాడు. అనంతరం ఈ రికార్డును ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన అల్జారీ జోసెఫ్ ఈ రికార్డును 2019 లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఈ రికార్డును సాధించాడు. జోసెఫ్ 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు (6/12) తీసాడు. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్ లో రికార్డు బౌలింగ్ గణాంకాలు. వేరే కాకుండా ఆడమ్ జంపా 6/19, అనిల్ కుంబ్లే 5/5, జస్ప్రీత్ బుమ్రా 5/10 గణాంకాలు నమోదు చేసారు.
7. అత్యధికంగా ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన కెప్టెన్ ఎమ్మెస్ ధోని (CSK)
ఇప్పటి వరకూ జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను ఫైనల్స్ చేర్పించిన కెప్టెన్ గా ఎమ్మెస్ ధోని రికార్డు సృష్టించాడు. ఇంతవరకూ ఏ కెప్టెన్ కి కూడా ఇది సాధ్యం కాలేదు. అసాధ్యం కూడా అని క్రికెట్ పండితులు చెబుతుంటారు. తాను కెప్టెన్ గా వ్యవహరించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును 8 సార్లు, పూణే సూపర్ జెయింట్ ను ఒకసారి ఫైనల్ కి చేర్చాడు. అంతేకాకుండా చెన్నై జట్టు 4 సార్లు 2010, 2011, 2018 మరియు 2021 లో ట్రోఫీలను గెలుచుకుంది. 2008, 2012, 2013, 2015 మరియు 2019 లో రన్నరప్ గా నిలిచింది. ఇలా అత్యధిక సార్లు తాను కెప్టెన్ గా వ్యహరించించిన జట్లను ఫైనల్స్ కు చేర్చడంలో విజయవంతమైన కెప్టెన్ గా ధోని ఖ్యాతి గడించాడు. భవిష్యత్తులో ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు, క్రీడాభిమానులు చెబుతున్నారు.
అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ఈ పదిలమైన, ఎవరికీ అసాధ్యంకాని ఈ రికార్డులను ప్రస్తుతమున్న యువ క్రీడాకారులు బద్దలు కొట్టగలరా? ధనాధన్ ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో మనం మరిన్ని రికార్డులు చూడగలమా? వీటిని చూడాలంటే వచ్చే ఏడాది జరగనున్న 16 వ ఐపీఎల్ సీజన్ వరకు వేచి చూడాల్సిందే.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు : Highest runs in IPL history
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్గ్ గా వ్యవహరించిన భారత స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఐదుగురిలో నలుగురు భారత క్రికెటర్లే ఉండడం గమనార్హం.
కోహ్లీ మొత్తం 223 మ్యాచుల్లో 215 ఇన్నింగ్స్ ఆడి 6624 పరుగులు చేసాడు. ఇందులో 5 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 578 ఫోర్లు, 218 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 113 పరుగులు.
శిఖర్ ధావన్ 206 మ్యాచుల్లో 205 ఇన్నింగ్స్ ఆడి 6244 పరుగులు చేసాడు. ఇందులో 2 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 701 ఫోర్లు, 136 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 106 పరుగులు.
డేవిడ్ వార్నర్ 162 మ్యాచులు ఆడి 5881 పరుగులు చేసాడు. ఇందులో 4 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 577 ఫోర్లు, 216 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 126 పరుగులు.
రోహిత్ శర్మ 227 మ్యాచుల్లో 222 ఇన్నింగ్స్ ఆడి 5879 పరుగులు చేసాడు. ఇందులో 1 సెంచరీ, 40 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 519 ఫోర్లు, 240 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 109 పరుగులు.
సురేష్ రైనా 205 మ్యాచుల్లో 200 ఇన్నింగ్స్ ఆడి 5528 పరుగులు చేసాడు. ఇందులో 1 సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 506 ఫోర్లు, 203 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 100 పరుగులు.