వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల వీరులు : Highest Run Scorers in ODI Cricket

ఇప్పటి వరకు వన్డేల్లో 9 డబుల్ సెంచరీలు నమోదవ్వగా అందులో భారత క్రికెటర్లే 6 నమోదు చేయడం విశేషం. అందులోనూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక్కడే మూడు డబల్ సెంచరీలు చేసాడు.

వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల వీరులు : Highest Run Scorers in ODI Cricket

వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల వీరులు : Highest Run Scorers in ODI Cricket

 

ఇప్పటి వరకు వన్డేల్లో 9 డబుల్ సెంచరీలు నమోదవ్వగా అందులో భారత క్రికెటర్లే 6 నమోదు చేయడం విశేషం. అందులోనూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక్కడే మూడు డబల్ సెంచరీలు చేసాడు.

 

వన్డే క్రికెట్ రికార్డుల్లో భారత్ హవా :  India is best in ODI's

వన్డే క్రికెట్. ఒకరోజు ఆట ఆడే క్రికెట్ 50 ఓవర్ల పాటు కొనసాగుతుంది. 1844 నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. అప్పట్లో 60 ఓవర్ల పాటు ఆడేవారు. అనంతరం దీనిని 50 ఓవర్లకు కుదించారు. క్రికెట్ ఆడే దేశాల్లో వన్డే మ్యాచుల్లో ఎన్నో ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. క్రికెట్ ప్రేమికులను అలరించేలా ఆయా క్రికెటర్లు తమ బ్యాట్లకు పని చెప్పి బౌలర్లను ఊచకోత కోస్తూ రికార్డులు సృష్టిస్తుంటారు.

 

ఒకప్పుడు సెంచరీ చేస్తే ఘనంగా ఉండేది. తరువాత డబుల్ సెంచరీలు కూడా సాధించి ఔరా అనిపించారు. ఇప్పటి వరకు వన్డేల్లో 9 డబుల్ సెంచరీలు నమోదవ్వగా అందులో భారత క్రికెటర్లే 6 నమోదు చేయడం విశేషం. అందులోనూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక్కడే మూడు డబల్ సెంచరీలు చేసాడు. దీంతో పాటుగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మొదటి పది మందిలో నలుగురు భారత బ్యాట్స్ మన్లు ఉండడం గమనార్హం.

 

అత్యధిక పరుగులు చేసిన మొదటి పది మంది బ్యాట్స్ మన్లు

 

1. సచిన్ టెండూల్కర్ (భారత్)

భారత్ లో క్రికెట్ దేవుడిగా అభిమానులతో పిలవబడే టెండూల్కర్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ 1989 లో పాకిస్థాన్ తో ఆడాడు. అప్పటికి సచిన్ వయసు 16 సంవత్సరాల 238 రోజులు కావడం విశేషం. తన ఆఖరి వన్డే మ్యాచ్ కూడా 2012 లో పాకిస్థాన్ పైనే ఆడడం గమనార్హం. మొత్తం తన కెరీర్లో 463 వన్డే మ్యాచుల్లో 452 ఇన్నింగ్స్ ఆడిన సచిన్ 41 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 44.83 సగటుతో 18,426 పరుగులు చేసాడు. ఇందులో ఒక డబల్ సెంచరీ, 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 2016 ఫోర్లు, 195 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 200. పరుగుల పరంగా సచిన్ కు దరిదాపుల్లో ఎవ్వరూ లేరు.

 

2. కుమార సంగక్కర (శ్రీలంక)

శ్రీలంకకు చెందిన సంగక్కర తన దేశం తరపున దాదాపు 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. కీపర్ గా, బ్యాట్స్ మన్ గా సంగక్కర మైదానంలో ఎటువంటి భావోద్వేగాలు తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ జట్టును నడిపించేవాడు. 22 ఏళ్లకే జాతీయ జట్టులో ప్రవేశించాడు. జూలై 2000 సంవత్సరంలో తన మొట్టమొదటి వన్డేను ఆడాడు. ఆఖరి వన్డేను 2015 లో ఆడాడు. మొత్తం 404 వన్డేల్లో 380 ఇన్నింగ్స్ లు ఆడాడు. 41.99 సగటుతో 14,234 పరుగులు చేసాడు. ఇందులో 25 సెంచరీలు, 93 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 1385 ఫోర్లు, 88 సిక్సులు బాదాడు. సంగక్కర అత్యధిక స్కోర్ 169 పరుగులు.

 

3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)

రికీ పాంటింగ్.. ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ గా చేసిన రోజుల్లో దేశ క్రికెట్ కి బంగారు శకం అనవచ్చు. 2004-2011 వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1995 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో మొట్టమొదటి వన్డే ఆడాడు. ఆఖరి వన్డేను 2012 లో భారత్ పై ఆడాడు. తన వన్డే కెరీర్లో మొత్తం 375 వన్డేల్లో 365 ఇన్నింగ్స్ ఆడాడు. 39 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 42.04 సగటుతో 13,704 పరుగులు చేసిన పాంటింగ్ ఖాతాలో 30 సెంచరీలు, 80 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 164 పరుగులు పాంటింగ్ అత్యధిక స్కోర్. రెండు ప్రపంచ కప్ లు, రెండు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి అత్యుత్తమ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

 

4. సనత్ జయసూరియ (శ్రీలంక)

వన్డే క్రికెట్లో 1990 దశకంలో తన అద్భుతమైన హార్డ్ హిట్టింగ్ తో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా నిలిచాడు జయసూరియ. 10 వేల పరుగులు, 300 వికెట్లు తీసి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్-రౌండర్ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచాడు. ప్రపంచంలోనే 50 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్ మన్. 1989 లో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి వన్డే ఆడాడు. ఆఖరి వన్డేను 2011 లో ఇంగ్లాండ్ పై ఆడాడు. మొత్తం తన కెరీర్లో 445 వన్డేల్లో 433 ఇన్నింగ్స్ ఆడిన జయసూరియ 13,430 పరుగులు చేసాడు. 32.13 అతని బ్యాటింగ్ సగటు. మొత్తం 28 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.

 

5. మహేల జయవర్ధనే (శ్రీలంక)

జయవర్ధనే శ్రీలంక టీమ్ కి కెప్టెన్ గా చేసిన కాలంలో విజయవంతంగా తన జట్టుని నడిపించాడు. రిటైర్మెంట్ తీసుకున్న తరువాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ గా ఉండి ఛాంపియన్స్ గా నిలిచేలా కృషి చేసాడు. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకి కోచ్ గా కూడా చేసాడు. మొత్తం 448 వన్డేల్లో 418 ఇన్నింగ్స్ ఆడిన జయవర్ధనే 39 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 33.38 సగటుతో 12,650 పరుగులు చేసాడు. ఇందులో 19 సెంచరీలు, 77 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 144 పరుగులు. కుమార సంగక్కరతో కలిసి శ్రీలంక మిడిలార్డర్ ను ఎంతో బలోపేతం చేసాడు.

 

6. విరాట్ కోహ్లీ (భారత్)

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్ మన్లలో ఒకడైన కోహ్లీ రన్ మెషిన్ గా పేరు గాంచాడు. అద్భుతమైన టెక్నిక్ తో పరుగులు రాబట్టే కోహ్లీ మంచి ఫీల్డర్ కూడా. అండర్-19 ప్రపంచ కప్ ను అందించిన కోహ్లీ జాతీయ జట్టుకి కూడా నాయకత్వం వహించాడు. ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ బ్యాటింగ్ సగటు 57.47 గా ఉంది. తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ ని 2008 లో శ్రీలంక పైన ఆడాడు. ఇప్పటివరకూ 265 వన్డేల్లో 256 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 39 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 44 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలతో 12,471 పరుగులు చేసాడు. విరాట్ అత్యధిక స్కోర్ 183 పరుగులు. ధోనీ కెప్టెన్ గా 2011 ప్రపంచ కప్ గెలిచిన టీమ్ లో విరాట్ సభ్యుడిగా ఉన్నాడు.

 

7. ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)

పాకిస్థాన్ కి చెందిన ఇంజమామ్ దేశం తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ టీమ్ కి హెడ్ కోచ్ గా కూడా చేసాడు. తన మొదటి వండని 1991 లో వెస్టిండీస్ పై ఆడాడు. 2007 లో తన ఆఖరి వన్డేని జింబాబ్వే పై ఆడాడు. పాకిస్తాను జట్టు తరపున మొత్తం 378 వన్డేల్లో 350 ఇన్నింగ్స్ ఆడిన ఇంజమామ్ 39.53 సగటుతో 11,739 పరుగులు చేసాడు. 53 సార్లు నాటవుట్ గా నిలిచాడు. ఇందులో 10 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

8. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)

దక్షిణాఫ్రికాకు చెందిన కల్లిస్ దేశపు సమకాలీన క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా ఘనత వహించాడు. దేశపు క్రికెట్ కోచ్ గా పనిచేసాడు. బ్యాటింగ్ తో పాటు స్వింగ్ బౌలింగ్ కూడా చేస్తూ మేటి ఆల్-రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. మొత్తం 328 వన్డేల్లో 314 ఇన్నింగ్స్ ఆడి 53 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 11,579 పరుగులను 44.36 సగటుతో తన ఖాతాలో వేసుకున్నాడు. 17 సెంచరీలు 86 అర్ధ సెంచరీలు చేసాడు. బౌలింగ్ లో 283 ఇన్నింగ్స్ లో 273 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఫిట్ ను రెండు సార్లు చేసిన కల్లిస్ 5/30 గణాంకాలు నమోదు చేసాడు.

 

9. సౌరభ్ గంగూలీ (భారత్)

లెఫ్ట్-హ్యాండ్ బ్యాట్స్ మన్ గంగూలీ మంచి ఆల్-రౌండర్ గా ఖ్యాతి గడించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 35 అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన కెరీర్లో 311 ఇన్నింగ్స్ లో 300 వన్డేల్లో ఆడిన గంగూలీ 41.02 సగటుతో 11,363 పరుగులు చేసాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 183 పరుగులు. 171 వన్డే ఇన్నింగ్స్ లో 100 వికెట్లు పడగొట్టాడు. 16 పరుగులకు 5 వికెట్లు (5/16) అతని ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

10. రాహుల్ ద్రావిడ్ (భారత్)

అభిమానులు, సహచరులు మిస్టర్ వాల్, మిస్టర్ ఢిఫెండబుల్ గా పిలుచుకునే రాహుల్ ద్రావిడ్ ఒకప్పటి భారత జట్టుకి వెన్నుముకగా నిలిచాడు. ద్రావిడ్ ని అవుట్ చేయడానికి బౌలర్లు ఆపసోపాలు పడేవారు. ప్రస్తుత భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న ద్రావిడ్ ఎన్నో సార్లు జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. 344 వన్డేల్లో 318 ఇన్నింగ్స్ ఆడిన ద్రావిడ్ 40 సార్లు నాటవుట్ గా నిలిచి 10,889 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 153 పరుగులు. సగటు 39.17 గా ఉంది. 12 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ద్రావిడ్ ఖాతాలో ఉన్నాయి. వికెట్ కీపర్, అండర్-19 కోచ్, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ఇలా బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిలిచాడు.