వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరులు : Highest Wicket Takers in ODI's

నిప్పులు చెరిగే బంతులు వేసే ఫాస్ట్ బౌలర్లు... చేతి వేళ్ళతో బంతిని గింగరాలు తిప్పి వికెట్లను గిరాటు వేసే స్పిన్నర్లు... ఒక మ్యాచ్ లో విజయానికి బౌలర్లు ఎంతో కీలకం.

వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరులు : Highest Wicket Takers in ODI's

 

వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరులు : Highest Wicket Takers in ODI's

 

నిప్పులు చెరిగే బంతులు వేసే ఫాస్ట్ బౌలర్లు... చేతి వేళ్ళతో బంతిని గింగరాలు తిప్పి వికెట్లను గిరాటు వేసే స్పిన్నర్లు... ఒక మ్యాచ్ లో విజయానికి బౌలర్లు ఎంతో కీలకం.

 

స్పిన్నర్లూ విన్నర్లే... : Spinners also Winners

తమ బౌలింగ్ తో బ్యాట్స్ మన్లను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్లు ప్రపంచంలో ఎందరో ఖ్యాతి గడించారు. ఒకప్పుడు ఫాస్ట్ బౌలింగ్ అంటే బెదిరిపోయే బ్యాట్స్ మన్లను ముత్తయ్య మురళీధరన్ రూపంలోని లెగ్ స్పిన్నర్ అంతకంటే ఎక్కువగా బెదిరిపోయేవాళ్లు. మురళీధరన్ వేసే బాల్ ఊహించని రీతిలో గింగరాలు తిరుగుతూ వచ్చి వికెట్లను గిరాటు వేసేది.

 

అందుకే వన్డే ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థానంలో ఉన్నదీ ఒక స్పిన్నర్ కావడం గమనార్హం. వన్డే బౌలింగ్ లో అగ్రస్థానంలో ఉన్న 10 మందిలో ముగ్గురు స్పిన్నర్లే కావడం విశేషం. శ్రీలంక, పాకిస్థాన్ నుంచి ముగ్గురు చొప్పున, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికా, భారత్ నుంచి ఒక బౌలర్ ఉన్నారు. భారత్ నుంచి అనిల్ కుంబ్లే ఒక్కడే చోటు సంపాదించుకున్నాడు.

 

వన్డే క్రికెట్ లో అగ్రస్థానంలో ని బౌలర్లు

 

1. ముత్తయ్య మురళీధరన్ (674)

శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ దిగ్గజ బౌలర్లలో అగ్రగణ్యుడు. వన్డేల్లో 350 మ్యాచ్ ల్లో 341 ఇన్నింగ్స్ ఆడిన మురళీధరన్ 534 వికెట్లు పడగొట్టాడు. ముప్పై పరుగులిచ్చి 7 వికెట్లు (7/30) పడగొట్టాడు. 5 వికెట్ల విన్యాసాన్ని 10 సార్లు సాధించాడు. మురళీధరన్ రికార్డును చేరుకోవాలంటే ఇప్పట్లో కష్టమే. 1993 లో వన్డే క్రికెట్  లోకి అడుగు పెట్టిన మురళీధరన్ 2011 వరకు దాదాపు 18 ఏళ్లపాటు దేశానికి సేవలందించాడు. అయితే మురళీధరన్ బౌలింగ్ శైలిపై ఎంతోమంది సందేహాలు వెలిబుచ్చారు. బయో నిపుణులు, ఐసీసీ పర్యవేక్షకులు పరీక్షలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు కొనసాగి ఎవ్వరికీ సాధ్యంకాని వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

 

2. వసీం అక్రమ్ (502)

పాకిస్థాన్ కి చెందిన వసీం అక్రమ్ స్వింగ్ బౌలర్ గా ప్రసిద్ధి చెందాడు. పలుమార్లు సర్జరీలు జరిగినా తట్టుకుని నిలబడ్డాడు. 1992 లో జరిగిన ప్రపంచ కప్ లో అక్రమ్ 18 వికెట్లు తీసి పాకిస్థాన్ కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మొత్తం 356 వన్డేలు ఆడిన అక్రమ్ 351 ఇన్నింగ్స్ ఆడాడు. 502 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 వికెట్ల ఫీట్ ను 6 సార్లు అందుకున్నాడు. 5/15 అక్రమ్ ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

3. వకార్ యూనిస్ (416)

వకార్ యూనస్ పాకిస్థాన్ కి చెందిన ఫాస్ట్ బౌలర్. పాకిస్థాన్ తరపున మొతం 262 వన్డేలు ఆడాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ ద్వయం పాకిస్థాన్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. రివర్స్ స్వింగ్ బౌలింగ్ చేయడం వకార్ ప్రత్యేకత. 1989 లో మొదటి వన్డే ఆడిన వకార్ 2003 లో జింబాబ్వే తో ఆఖరి వన్డే ఆడాడు. 258 ఇన్నింగ్స్ లో 416 వికెట్లను తీసాడు. 13 సార్లు 5 వికెట్ల ఫీట్ ను సాధించాడు. 7/36 వకార్ ఉత్తమ బౌలింగ్.

 

4. చమిందా వాస్ (400)

స్థిరమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ కి పెట్టింది పేరుగా శ్రీలంకకు చెందిన చమిందా వాస్ నిలిచాడు. 1994 లో ఇండియా పై మొదటి వన్డే ఆడిన వాస్, 2008 లో అదే ఇండియాపై ఆఖరి వన్డే ను ఆడడం విశేషం. ముత్తయ్య మురళీధరన్ పైనే ఆధారపడిన శ్రీలంకకు వాస్ రూపంలో మంచి బౌలర్ లభించడంతో శ్రీలంక ఎన్నో అపురూప విజయాలను వీరిరువురి నుంచి అందుకుంది. 322 వన్డేల్లో 320 ఇన్నింగ్స్ ఆడిన వాస్ 400 వికెట్లను చేరుకున్నాడు. 5 వికెట్లను 4 సార్లు నమోదు చేసాడు. 19 పరుగులకు 8 (8/19) వికెట్లు తీయడం వాస్ కెరీర్ లో గొప్ప విజయంగా చెప్పవచ్చు.

 

5. షాహిద్ అఫ్రిది (395)

పాకిస్థాన్ కి చెందిన అఫ్రిది ఆల్-రౌండర్. లెగ్ సిప్నర్, బ్యాట్స్ మన్. 16 సంవత్సరాల వయస్సులోనే పాకిస్థాన్ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. 1996 అక్టోబర్ లో మొదటి వన్డే, 2015 లో ఆఖరి వన్డే ఆడాడు. 1996 లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 37 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. 300 వికెట్లతో పాటు 4000 పరుగులు చేసిన ఆల్-రౌండర్ గా గుర్తింపు పొందాడు. 398 వన్డేల్లో 372 ఇన్నింగ్స్ ఆడి 395 వికెట్లు తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను 9 సార్లు సాధించిన అఫ్రిది 12 పరుగులకు 7 (7/12) వికెట్లు తీసి ఉత్తమ గణాంకాలు నమోదు చేసాడు.

 

6. షాన్ పొల్లాక్ (393)

అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకడిగా దక్షిణాఫ్రికాకు చెందిన పొల్లాక్ గుర్తింపు పొందాడు. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. షాన్ తండ్రి పీటర్ పొల్లాక్, మామ గ్రేమ్ పొల్లాక్ ఇద్దరూ లెజండరీ క్రికెటర్లే. తన నిప్పులు చెరిగే బంతులతో స్థిరమైన బౌలింగ్ తో బ్యాట్స్ మన్లను వణికించేవాడు. 303 మ్యాచుల్లో 397 ఇన్నింగ్స్ ఆడిన పొల్లాక్ 393 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 5 వికెట్లను ఆరు సార్లు తీసాడు. 35 పరుగులకు 6 వికెట్లు అత్యుత్తమ బౌలింగ్.

 

7. గ్లెన్ మెక్ గ్రాత్ (381)

ఆస్ట్రేలియాకు చెందిన మెక్ గ్రాత్ 14 సంవత్సరాలపాటు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 1993 లో మొదటి వన్డే దక్షిణాఫ్రికాపై, ఆఖరి వన్డే 2007 ఏప్రిల్ లో శ్రీలంకపై ఆడాడు. అతి వేగవంతం కాకుండా ఖచ్చితమైన లెంగ్త్ బౌలింగ్ వేస్తూ ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్నాడు. మొత్తం 250 వన్డేల్లో 248 ఇన్నింగ్స్ ఆడి 381 వికెట్లు తీసాడు. 7 సార్లు 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. 15 పరుగులకు 7 వికెట్లు (7/15) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

8. బ్రెట్ లీ (380)

మూడు ఫార్మాట్ల క్రికెట్ (టెస్ట్, వన్డేలు, టీ20 ) లు ఆడిన ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఫాస్ట్ బౌలర్. ఆసీస్ కి 2000 దశకంలో తమ అమ్ములపొదిలోని ప్రధానమైన ఆయుధం బ్రెట్ లీ కావడం విశేషం. అత్యుత్తమ ఆల్-రౌండర్. జనవరి 2000 లో మొదటి వన్డే పాకిస్తాన్ పై ఆడిన బ్రెట్ లీ 2012 లో ఆఖరి వన్డే ఇంగ్లాండ్ పై ఆడాడు. బౌన్సర్లకి మారుపేరు. 221 మ్యాచుల్లో 217 ఇన్నింగ్స్ ఆడిన బ్రెట్ లీ 380 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 వికెట్ల ఫీట్ ను 9 సార్లు సాధించాడు. 22 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు.

 

9. లసిత్ మలింగ (338)

శ్రీలంకకు చెందిన మలింగ పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచుల్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అతి వేగంగా స్వింగ్ చేయడం, ఇన్-స్వింగ్ యార్కర్లు వేయడమే కాకుండా అతి తక్కువ స్లో బాల్స్ వేస్తూ బ్యాట్స్ మన్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. శ్రీలంకకు ఎన్నో మరపురాని విజయాల్లో పాలుపంచుకున్నారు. 2004 లో వన్డే కెరీర్ ని ప్రారంభించిన మలింగ 2019 లో బంగ్లాదేశ్ పై తన ఆఖరి వన్డే ఆడాడు. మొత్తం 226 వన్డేల్లో 220 ఇన్నింగ్స్ ఆడిన మలింగ 338 వికెట్లను తీసాడు. 8 సార్లు ఐదు వికెట్లను తీసాడు. 38 పరుగులకు 6 వికెట్లు (6/38) మలింగ ఉత్తమ బౌలింగ్.

 

10. అనిల్ కుంబ్లే (337)

దాదాపు 18 ఏళ్ళు టెస్టులు, వన్డేలలో తన సేవలందించిన భారత్ కు చెందిన అనిల్ కుంబ్లే ప్రపంచంలోని అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడు. జంబో గా తన సహచరులతో పిలిపించుకునే కుంబ్లే మ్యాచ్లో గాయపడి కుట్లు వేయించుకుని అలా కట్లతోనే మైదానంలోకి దిగి గెలుపును అందించిన మేటి బౌలర్. 1990 ఏప్రిల్ లో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఆరంగ్రేటం చేసాడు. 2007 లో వన్డేలకు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లో జెంటిల్మన్ గా పిలిపించున్న వ్యక్తి. కెరీర్లో 271 వన్డేల్లో 265 ఇన్నింగ్స్ ఆడిన కుంబ్లే 337 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 వికెట్లను రెండుసార్లు తీసాడు. 12 పరుగులకు 6 వికెట్లు (6/12) కుంబ్లే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

ఎంతమంది బౌలర్లు వస్తున్నా మురళీధరన్, వసీం అక్రమ్ లాంటి బౌలర్ల రికార్డును తుడిచిపెట్టడం అసాధ్యమనే చెప్పవచ్చు. అయితే నిలకడ, స్థిరమైన బౌలింగ్ తో వికెట్లు తీయగలిగితే రికార్డులనైనా బద్దలు కొట్టొచ్చు అనడంలో సందేహమే లేదు. అయితే ఇప్పటి బౌలర్లు గాయాల బారిన పడి ఏకంగా కెరీర్ నే ముగిస్తున్నారు.