భారత్ ప్రపంచకప్ గెలిచి 40 ఏళ్ళు : 40 years since India won the World Cup

భారత్ లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ను ఎవ్వరూ అంచనా వేయలేరు. ఎందుకంటే క్రికెట్ ని ఒక మతంగా... క్రికెటర్లను తమ ఆరాధ్య దేవుళ్లుగా కొలుస్తారు. క్రికెట్లో ప్రపంచ కప్ గెలవాలని వన్డే క్రికెట్ ఆడే ప్రతి జట్టూ ఆశిస్తుంది. దానికి భారత్ కూడా అతీతమేమీ కాదు.

భారత్ ప్రపంచకప్ గెలిచి 40 ఏళ్ళు : 40 years since India won the World Cup

భారత్ ప్రపంచకప్ గెలిచి 40 ఏళ్ళు : 40 years since India won the World Cup 

భారత్ లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ను ఎవ్వరూ అంచనా వేయలేరు. ఎందుకంటే క్రికెట్ ని ఒక మతంగా... క్రికెటర్లను తమ ఆరాధ్య దేవుళ్లుగా కొలుస్తారు. క్రికెట్లో ప్రపంచ కప్ గెలవాలని వన్డే క్రికెట్ ఆడే ప్రతి జట్టూ ఆశిస్తుంది. దానికి భారత్ కూడా అతీతమేమీ కాదు. 1975 లో వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ను ప్రారంభించారు. అది ప్రారంభమై ఇప్పటికి 48 ఏళ్ళు గడిచాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ తొలి రెండు టోర్నమెంట్లను వెస్టిండీస్ జట్టు గెలుపొందింది. అరివీర భయంకర బౌలర్లు ఉన్న వెస్టిండీస్ ను మూడో సారి అంటే 1983 లో అండర్ డాగ్ జట్టుగా బరిలోకి దిగిన భారత జట్టు మట్టి కరిపించి టైటిల్ నెగ్గింది. వన్డే ప్రపంచ కప్ గెలిచి 40 ఏళ్ళు పూర్తయింది. 1983 ప్రపంచ కప్ లో భారత్ ప్రస్థానాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.

1983 జూన్ 25 వ తేదీన ఇంగ్లాండ్ లో జరిగిన మూడవ ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్ ను మట్టికరిపించి కపిల్ సారథ్యంలోని భారత జట్టు మొట్టమొదటిసారి వరల్డ్ కప్ ను ముద్దాడింది. 1975... 1979... సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ కప్ టైటిళ్లను నెగ్గిన వెస్టిండీస్ 1983 లో కూడా టైటిల్ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ భారత టీమ్ అద్భుత రీతిలో చెలరేగి తొలిసారి ప్రపంచ కప్ ముద్దాడింది. అప్పటివరకూ క్రికెట్లో భారత జట్టు అంటే సాధారణ జట్టుగానే పరిగణించేవారు. అంతగా చెప్పుకోదగిన ప్రదర్శన భారత్ నుండి అంతక్రితం రాలేదు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగాయి. అనామక జట్టుగానే పరిగణించిన భారత జట్టు గ్రూప్-B నుంచి బరిలోకి దిగిన టీమ్ ఇండియా 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలను నమోదు చేసింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది. వెస్టిండీస్ జట్టు లీగ్ దశ ముగిసేటప్పటికి 5 మ్యాచుల్లో గెలిచి గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్ కి చేరింది. భారత జట్టు నాలుగు విజయాలు, రెండు ఓటములతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బరిలోకి దిగింది. సెమీఫైనల్లో సొంత మైదానంలో ఆడిన ఇంగ్లాండ్ జట్టును ఓడించి తొలిసారిగా ప్రపంచ కప్ ఫైనల్ కి దూసుకెళ్లింది.

భారత్ అద్భుత విజయాలు నమోదు చేసి ఫైనల్ చేరినప్పటికీ... భారత జట్టు ఎదో అదృష్టం కలిసొచ్చి గాలివాటంగా ఫైనల్ చేరిందని, అరివీర భయంకరమైన జట్టుగా పేరున్న వెస్టిండీస్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అందరూ పెదవి విరిచారు. క్రికెట్ కు మక్కాగా పేరొందిన ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. టాస్ ఓడిన భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టింది. 60 ఓవర్ల ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 54.5 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 183 పరుగులకే ఆలౌట్ అయింది. క్రిష్ణమాచారి శ్రీకాంత్ 57 బంతుల్లో 38 పరులను 7 ఫోర్లు, ఒక సిక్సుతో సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ సందీప్ పాటిల్ 29 బంతుల్లో ఒక సిక్సు సాయంతో 27 పరుగులు, మొహిందర్ అమర్‌నాథ్ 80 బంతులను ఎదుర్కొని మూడు ఫోర్లతో 26 పరుగులు సాధించారు. జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ 8 బంతులను ఎదుర్కొని మూడు ఫోర్లతో 15 విలువైన పరుగులను చేసాడు. భారత జట్టు బ్యాటింగ్ టెస్ట్ మ్యాచ్ ను తలపించడంతో పరుగులు రావడం గగనమై పోయింది. భారత్ విధించిన చిన్న లక్ష్యం భీకర ఫామ్ లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు ఛేదించడం నల్లేరుపై నడకే అని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో భీకర ఫామ్ లో ఉన్న వెస్టిండీస్ జట్టు 52 ఓవర్లో 140 పరుగులకే చాప చుట్టేసింది. వెస్టిండీస్ జట్టులో సర్ వివ్ రిచర్డ్స్ ఒక్కరే 28 బంతుల్లో 33 పరుగులను 7 ఫోర్లతో సాధించి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో మదన్‌లాల్, మొహిందర్ అమర్‌నాథ్ తలో 3 వికెట్లను పడగొట్టగా, బల్విందర్ 2 వికెట్లు, రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ తలో వికెట్ తీశారు.

 

ఆనాటి ఉద్విగ్నభరిత క్షణాలు ఇప్పటికీ సగటు క్రికెట్ అభిమాని మనసులో నాటుకుని ఉన్నాయి. లార్డ్స్ గ్రౌండ్ లోని బాల్కనీ నుండి జట్టు సారథి కపిల్ దేవ్ ప్రపంచ కప్ ట్రోఫీని చూపుతున్న దృశ్యాలు ఎప్పటికీ మరచిపోలేనివి. అప్పటి నుంచి టీమిండియా అంటే ప్రత్యర్థి జట్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆడాల్సి వచ్చేవి. ఈ ప్రపంచ కప్ తరువాత భారత క్రికెట్ ప్రస్థానం మరో మెయిలు రాయికి చేరిందని చెప్పవచ్చు. అనంతరం 28 ఏళ్ల నిరీక్షణ తరువాత 2011 లో భారత్ లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో మహేంద్ర సింగ్ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ ఏడాది భారత్ లో జరిగే ప్రపంచ కప్ ను ఈసారి కూడా భారత్ గెలవాలని సగటు భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.